పదో తరగతి ఇన్విజిలేటర్ల మార్పు
ABN , Publish Date - Mar 22 , 2026 | 01:35 AM
ఉమ్మడి జిల్లాలో పదో తరగతి గ్రూప్ సబ్జెక్టుల పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్లను మార్పు చేశారు. కొత్తవారిని నియమించారు. ఇందులో కూడా పాత తప్పులే పునరావృతమయ్యాయి. ఫలితంగా బఫర్ జాబితాల్లోంచి వందలాది మంది రెగ్యులర్ వారిని ఇన్విజిలేటర్లుగా నియమించాల్సి వచ్చింది.
పునరావృతమైన తప్పులు
ఒంగోలు విద్య, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో పదో తరగతి గ్రూప్ సబ్జెక్టుల పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్లను మార్పు చేశారు. కొత్తవారిని నియమించారు. ఇందులో కూడా పాత తప్పులే పునరావృతమయ్యాయి. ఫలితంగా బఫర్ జాబితాల్లోంచి వందలాది మంది రెగ్యులర్ వారిని ఇన్విజిలేటర్లుగా నియమించాల్సి వచ్చింది. కొందరు ప్రైవేటు పాఠశాలల టీచర్లను నియమించే ప్రక్రియ ప్రహసనంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రైవేటు టీచర్లను తమ పిల్లలు పరీక్షలు రాసే కేంద్రాలకు ఇన్విజిలేటర్లుగా నియమించడంతో వారందరినీ గుర్తించి తొలగించి వారి స్థానంలో బఫర్ జాబితాలోని టీచర్లను నియమించడంలో ఎంఈవోలు తలమునకలు కావాల్సి వచ్చింది. కొందరు ప్రభుత్వ పాఠశాలల టీచర్లను కూడా వారు పనిచేస్తున్న స్కూళ్ల విద్యార్థులు పరీక్షలు రాస్తున్న కేంద్రాలకు కేటాయించారు. దీంతో వారిని కూడా మార్చాల్సి వచ్చింది. ఇన్విజిలేటర్ల నియామకంలో ప్రభుత్వం మొదట ప్రకటించిన దానికి, ఆచరణకు పొంతన లేకుండాపోయింది. నాన్‌లాంగ్వేజెస్ సబ్జెక్టులకు లాంగ్వేజీ టీచర్లను, లాంగ్వేజీ సబ్జెక్టులకు నాన్ లాంగ్వేజీ సబ్జెక్టు టీచర్లను ఇన్విజిలేటర్లుగా నియమిస్తామన్నారు. అయితే అందుకు భిన్నంగా నాన్ లాంగ్వేజీ సబ్జెక్టులకు నాన్ లాంగ్వేజీ సబ్జెక్టు టీచర్లను ఇన్విజిలేటర్లుగా నియమించారు.