అపర భగీరథుడు చంద్రబాబు
ABN , Publish Date - Aug 24 , 2026 | 11:36 PM
దశాబ్దాలుగా పశ్చిమ ప్రకాశం ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నం కావడంతో కనిగిరి నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రాజెక్టు సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషిని కొనియాడుతూ టీడీపీ ఆధ్వర్యంలో కనిగిరి, పీసీపల్లి మండలాల్లో సోమవారం మోటార్‌సైకిల్, ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.
వెలిగొండ ప్రారంభోత్సవం చరిత్రలో చిరస్మరణీయ ఘట్టం
ప్రాజెక్టు ప్రారంభోత్సవ సన్నాహక ట్రాక్టర్ ర్యాలీలో మంత్రి స్వామి, ఎమ్మెల్యే ఉగ్ర
గంగమ్మ గుడి నుంచి పీసీపల్లి వరకు సాగిన ట్రాక్టర్ ర్యాలీ
పీసీపల్లి, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి) : దశాబ్దాలుగా పశ్చిమ ప్రకాశం ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నం కావడంతో కనిగిరి నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రాజెక్టు సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషిని కొనియాడుతూ టీడీపీ ఆధ్వర్యంలో కనిగిరి, పీసీపల్లి మండలాల్లో సోమవారం మోటార్‌సైకిల్, ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. పీసీపల్లి మండలంలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, శాసనసభ్యులు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పాల్గొన్నారు. గంగమ్మ గుడి వద్ద ప్రారంభమైన ట్రాక్టర్ ర్యాలీ వెంగళాపురం, పోతవరం, మారెళ్ల, గోపవరపువారిపల్లి మీదుగా పీసీపల్లి వరకు సాగింది. పెద్దసంఖ్యలో రైతులు, ప్రజలు, పార్టీశ్రేణులు పాల్గొన్నారు. దారిపొడవునా ఉన్న గ్రామాల్లోని వారు వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తమ సంఘీభావాన్ని తెలిపారు. అనంతరం పీసీపల్లి బ్యాంకు సెంటరులో నిర్వహించిన సభలో మంత్రి స్వామి మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా వెలిగొండ ప్రాజెక్టు కోసం పశ్చిమప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారని, అనేక ప్రభుత్వాలు మారినా ప్రాజెక్టు పూర్తి కోసం ప్రజలు ఆశగా ఎదురు చూశారని చెప్పారు. సీఎం చంద్రబాబునాయుడు ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం చేయడంతో నేడు ప్రారంభోత్సవానికి సిద్ధమైందన్నారు. ప్రజల చిరకాల కోరిక నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నీటి పారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చూపిన చొరవ, పట్టుదల అభినందనీయమని కొనియాడారు. ఆ కల ఈనెల 31వ తేదీన నెరవేరబోతుందన్నారు. వెలిగొండ కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని పశ్చిమ ప్రాంత ప్రజల భవిష్యత్తును మార్చే జీవనాడి అని ఆయన చెప్పారు. ప్రాజెక్టు వల్ల వ్యవసాయం అభివృద్ధి చెందడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని తెలిపారు. అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా ఫ్లోరోసి్‌సతో బాధపడుతున్న ప్రజలకు ఇంటింటికీ కుళాయి ద్వారా మంచినీరు లభిస్తుందన్నారు. గత వైసీపీ పాలకులు ప్రాజెక్టును పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేశారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఏనుగంటి శ్రీను, మాజీ అధ్యక్షుడు రామయ్య, నాగేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మన్ ఈశ్వరయ్య, ఏఎంసీ చైర్మన్ ఏరవ రమాశ్రీనివాస్, డైరెక్టర్ మాధవరావు, నాయకులు సుబ్బారావు, నాగరాజు, ఓబులురెడ్డి, కృష్ణారెడ్డి, కొండపునాయుడు పాల్గొన్నారు.
అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు.. పీసీపల్లికి వెలిగొండ జలాలు
ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ పీసీపల్లి మండలం వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో లేదని కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని, పీసీపల్లి మండలానికి వెలిగొండ జలాలు తీసుకొస్తామని చెప్పారు. ఇటీవల మంత్రి స్వామి, తాను సీఎంను కలిసి పీసీపల్లికి వెలిగొండ జలాలపై చర్చించామన్నారు. తప్పనిసరిగా పీసీపల్లి మండలంలో కూడా వెలిగొండ జలాలను పారిస్తామని చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఈ ప్రాంత ప్రజల విజయోత్సవం అని అన్నారు.
గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు
ఈ సందర్భంగా గంగమ్మ గుడి ప్రాంగణానికి చేరుకున్న మంత్రి స్వామి, ఎమ్మెల్యే ఉగ్రలు మహిళలతో కలిసి గంగమ్మకు పొంగళ్లను తలపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు.