రామాయపట్నం పోర్టుకు సెంట్రల్ కస్టమ్స్ క్లియరెన్స్
ABN , Publish Date - Nov 18 , 2026 | 02:33 AM
రామాయపట్నం పోర్టులో ఎగుమతులు, దిగుమతులకు సెంట్రల్ కస్టమ్స్ క్లియరెన్స్ లభించింది. కొద్ది నెలలుగా పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న విషయం విదితమే. ఈ ఏడాది డిసెంబరు నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్దేశించినప్పటికీ తాజాగా ప్రారంభ కార్యక్రమాన్ని మార్చికి వాయిదా వేసుకున్నట్లు సమాచారం.
గెజిట్ నోటిఫికేషన్ విడుదల
శరవేగంగా పనులు.. మార్చిలోపు పూర్తయ్యే అవకాశం
కందుకూరు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : రామాయపట్నం పోర్టులో ఎగుమతులు, దిగుమతులకు సెంట్రల్ కస్టమ్స్ క్లియరెన్స్ లభించింది. కొద్ది నెలలుగా పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న విషయం విదితమే. ఈ ఏడాది డిసెంబరు నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్దేశించినప్పటికీ తాజాగా ప్రారంభ కార్యక్రమాన్ని మార్చికి వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మొత్తంగా 90 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. నాలుగు బెర్త్‌ల నిర్మాణం, బ్రేక్ వాటర్ పనులు దాదాపు పూర్తవగా డ్రెడ్జింగ్, గోదాముల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన సెంట్రల్ కస్టమ్స్ క్లియరెన్స్ ఇస్తూ కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏటా 3.4కోట్ల టన్నుల సరుకు ఎగుమతులు, దిగుమతులు పోర్టు నుంచి జరుగుతాయని అంచనా. కాగా అందుకోసం కస్టమ్స్ క్లియరెన్స్ అక్టోబరు 6న వెలువడగా గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇక్కడ కస్టమ్స్ శాఖకు సంబంధించిన కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభమవుతాయని పనులు పూర్తయిన వెంటనే పోర్టు ప్రారంభ తేదీ ఖరారవుతుందని అంచనా వేస్తున్నారు. మార్చిలోపే రామాయపట్నం పోర్టు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.