Share News

సెంట్రల్‌ బ్యాంకు సీఈవో ఔట్‌!

ABN , Publish Date - Jun 20 , 2026 | 02:41 AM

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) ప్రస్తుత సీఈవోగా వ్యవహరిస్తున్న పి.దత్తాత్రేయ వెంకటశర్మను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని సహకార శాఖ కమిషనర్‌ అహ్మద్‌బాబు ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రస్తుత బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జ్‌ను ఆదేశించారు.

సెంట్రల్‌ బ్యాంకు సీఈవో ఔట్‌!

తక్షణ చర్యలకు బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జ్‌కు కమిషనర్‌ ఆదేశం

జిల్లా సహకారాధికారిని సంజాయిషీ కోరిన అహ్మద్‌బాబు

ఒంగోలు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) ప్రస్తుత సీఈవోగా వ్యవహరిస్తున్న పి.దత్తాత్రేయ వెంకటశర్మను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని సహకార శాఖ కమిషనర్‌ అహ్మద్‌బాబు ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రస్తుత బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జ్‌ను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా శర్మను సీఈవోగా కొనసాగిస్తున్నారంటూ బ్యాంకు డిపాజిట్‌దారుడైన కె.సంపత్‌కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. శర్మను బ్యాంకు సీఈవోగా నియామకానికి ఆమోదం కోరుతూ ఆర్‌బీఐకి పోర్టల్‌ ద్వారా బ్యాంకు దరఖాస్తు చేయగా తిరస్కరించిందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్‌బీఐ తిరస్కరించినా సీఈవో విషయంలో బ్యాంకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆ పోస్టుకు.. శర్మ తగిన వ్యక్తి కాదని ఆర్‌బీఐ తిరస్కరణ ఉత్తర్వులలో పేర్కొన్న విషయాన్ని పిటిషన్‌లో వివరించారు. కాగా ఆయా విషయాలను పరిశీలించిన సహకారశాఖ కమిషనర్‌ అలా కొనసాగించడం సరైనది కాదని ఉత్తర్వులలో పేర్కొన్నారు. తక్షణం ఆర్‌బీఐ సూచనల ప్రకారం చర్యలు తీసుకొని తమ కార్యాలయానికి తెలియజేయాలని బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జ్‌ను ఆదేశించారు. దీంతో ప్రస్తుత సీఈవో శర్మను తొలగించక తప్పని పరిస్థితి బ్యాంకు పాలకవర్గానికి ఏర్పడింది. ఇదిలా ఉండగా ఈ విషయంపై జిల్లా సహకార అధికారిని కూడా కమిషనర్‌ సంజాయిషీ కోరారు. బ్యాంకు బోర్డు సభ్యునిగా డీసీవో హోదాలో ఉన్న అధికారి ఇందుకు సంబంధించిన అంశాలను సహకార శాఖ రిజిస్ర్టార్‌ దృష్టికి ఎందుకు తీసుకురాలేదన్న దానికి వివరణ ఇవ్వాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 02:41 AM