సాగర తీరంలో సంబరాలు
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:58 AM
సింగరాయకొండ మండలం పాకల తీరంలో రెండు రోజులపాటు జరగనున్న సంబరాలకు సర్వం సిద్ధమైంది. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లు శుక్రవారం సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చాయి. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు, రేపు పాకల వద్ద బీచ్ ఫెస్టివల్
సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం
తొలిరోజు తరలిరానున్న మంత్రులు, ఉమ్మడి జిల్లా కీలక నేతలు
రెండు రోజులపాటు క్రీడా, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు
రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు
జబర్దస్త్ టీంల ప్రత్యేక ప్రదర్శనలు
రోజుకు 50వేల మంది వస్తారని అంచనా
500 మంది పోలీసులతో బందోబస్తు
తుది ఏర్పాట్లను పరిశీలించిన యంత్రాంగం
ఒంగోలు, ఫిబ్రవరి 13 (ఆంఽధ్రజ్యోతి) : సింగరాయకొండ మండలం పాకల తీరంలో రెండు రోజులపాటు జరగనున్న సంబరాలకు సర్వం సిద్ధమైంది. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లు శుక్రవారం సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చాయి. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమాలు రాత్రి 10 గంటల వరకూ కొనసాగుతాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఉంటాయి. రెండు రోజులు పలు క్రీడా, సాం స్కృతిక, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. బీచ్ కబడ్డీ, వాలీబాల్, ఇతర క్రీడా పోటీలు, హెలికాప్టర్ ప్రయాణం, బోట్ రైడింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. జబర్దస్త్ యాక్టర్ల స్కిట్‌లు, తెలుగు రాష్ట్రాల్లో పేరున్న గాయకులతో పాటలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ యాంకర్ సుమ నేతృత్వంలో శనివారం రాత్రి కార్యక్రమాలు సాగనున్నాయి.
నేడు ఉదయం ప్రారంభం
రెండు రోజులపాటు జరిగే బీచ్ ఫెస్టివల్‌ను శనివారం ఉదయం మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ రాజాబాబు ఇతర ఉన్నతాధికారులు ప్రారంభించనున్నారు సాయంత్రం కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డాక్టర్ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌లతోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు హాజరుకానున్నారు. సాయంత్రం ఆరు గంటలకు వారంతా తీరంలో సాగర్ హారతి ఇచ్చి అనంతరం జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెండో రోజైన ఆదివారం శివరాత్రి కావడంతో తదనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఆ రోజు అర్ధరాత్రి దాటే వరకు కార్యక్రమాలు కొనసాగేలా ఏర్పాట్లు చేస్తుండగా రాత్రి జరిగే కార్యక్రమాల్లో మంత్రులు కొల్లు రవీంద్ర, డాక్టర్ స్వామి ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. రోజుకు 50వేల మంది వరకు ప్రజలు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేసి తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు రెండు కిలోమీటర్ల పరిధిలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమారు ఎడెమినిదివేల మంది కూర్చొని కార్యక్రమాలను వీక్షించే విధంగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఆహార పదార్థాలకు ఇబ్బంది లేకుండా భారీ పుడ్ కోర్టులను ఏర్పాటుచేస్తుండగా అందులో వివిధ రకాలకు చెందిన 40 స్టాల్స్ పెట్టనున్నారు. మంచినీరు. మజ్జిగ అందుబాటుతోపాటు అలాగే తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు.
భారీ బందోబస్తు.. గజ ఈతగాళ్లు
జాతీయ రహదారి నుంచి పాకల వెళ్లే రోడ్డు మార్గం సింగిల్ లైన్ కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఒకవైపు నుంచి వెళ్లి మరోవైపు నుంచి తిరిగి హైవేకి వచ్చేలా రూటు ఖరారు చేశారు. అలాగే కార్యక్రమాల వద్ద వీఐపీలకు ఒకచోట ఇతరులకు మరోచోట భారీ వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ రాజాబాబు నేతృత్వంలో జేసీ కల్పనాకుమారి ఇతరశాఖల కీలక అధికారులంతా ఈ ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా ఎస్పీ హర్షవర్థన్‌రాజు నేతృత్వంలో 500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీచ్ ఫెస్టివల్‌కు వచ్చిన వారు సముద్ర స్నానాలు ఇతర కార్యక్రమాలతో ప్రమాదాల బారిన పడకుండా బందోబస్తుతో గజ ఈతగాళ్ళను కూడా సిద్ధంగా ఉంచుతున్నారు. జాతీయ రహదారి నుంచి సముద్రతీరం వరకు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోలు రూముల నుంచి పర్యవేక్షించనునానరు. మొత్తంగా పాలక బీచ్ ఫెస్టివల్‌ను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. జాయింట్ కల్టెర్ కల్పనాకుమారి, ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఈ కార్యక్రమ నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నా మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ శుక్రవారం సాయంత్రం పాకల బీచ్ ప్రాంతాన్ని సందర్శించి తుది ఏర్పాట్లు పరిశీలించారు. స్థానికంగా విధుల్లో ఉన్న అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు.