తౌషిక్, మౌలాబి మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలి
ABN , Publish Date - Oct 01 , 2026 | 10:39 PM
సింగరాయకొండలోని శ్రీచైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో చదువుతున్న విద్యార్థి తైషిక్ మృతి, న్యాయం కోసం ఆందోళన చేస్తున్న ఆ విద్యార్థి తల్లి మౌలాబి మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా, సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
నిందితులను అరెస్టు చేసే వరకు ఉమ్మడిగా పోరాటం
12న 50వేల మందితో ఒంగోలులో మహాధర్నా
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెల్లడి
ఒంగోలు కార్పొరేషన్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : సింగరాయకొండలోని శ్రీచైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో చదువుతున్న విద్యార్థి తైషిక్ మృతి, న్యాయం కోసం ఆందోళన చేస్తున్న ఆ విద్యార్థి తల్లి మౌలాబి మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా, సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. గురువారం ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో ముస్లిం మైనార్టీ, దళిత, ప్రజాసంఘాలు, వామపక్ష నేతలతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీలు, పేదలు, దళితులకు అన్యాయం జరిగితే పాలక, ప్రతిపక్షం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనలో ప్రజాప్రతినిధులు, పోలీసుల సహకారం ఉందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. తక్షణమే శ్రీచైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అటు కందుకూరులో లక్ష్మీనారాయణ మృతి, ఇటు ఒంగోలులో ముప్పవరపు వీరయ్యచౌదరి హత్య కేసుపై స్పందించి, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ చేయిస్తున్న ప్రభుత్వం ముస్లిం, మైనార్టీలు, దళితులపై జరుగుతున్న దాడులు, హత్యల విషయంలో నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. ఇప్పటికైనా వైసీసీ మౌనం వీడి బాధిత కుటుంబాలకు అండగా ప్రశ్నించాలన్నారు. పదిరోజుల్లో ఘటనపై స్పందించకుంటే ఈనెల 12వ తేదీన ప్రకాశం భవనం వద్ద50వేల మంది ఉమ్మడి ప్రకాశం జిల్లాల ప్రజలతో మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ గుంటూరులో జనసేన కార్యకర్త మరణిస్తే స్వయంగా వెళ్లి పరామర్శించిన ఆయన.. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన చీకటి గోపి లాక్‌పడెత్‌పై కనీస పరామర్శ లేదని ప్రశ్నించారు. అంతకుముందు పలురాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా బాధ్యులు నరేంద్రమాదిగ,జండ్రాజుపల్లి ఆంజనేయులు,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, శ్రీపతి సతీష్, సీపీఐ(ఎంఎల్) నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, పీఓడబ్ల్యూ నాయకురాలు బి. పద్మ, ముస్లిం సంఘాల నాయకులు షేక్ ఖాదర్‌వలి, షేక్ రఫీ, షేక్ అల్లాభక్షు, నవ్యాంధ్ర ట్రస్ట్ నాయకులు మహబూబ్‌బాషా, సింగరాయకొండ ముస్లిం నాయకులు షేక్ రఫీ, పటేల్ పాల్గొన్నారు.