మునిసిపల్ టీచర్ల వర్గీకరణ
ABN , Publish Date - Oct 06 , 2026 | 01:45 AM
రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు మునిసిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వర్గీకరణ పూర్తయింది. వీరిని జిల్లా, జోన్ కేడర్లుగా నిర్ధారించారు. విభజిత జిల్లాలకు ఉమ్మడి జిల్లాల నుంచి టీచర్లను కేటాయించాల్సి ఉన్నందున మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థలకు క్యాడర్ నిర్ధారణకు సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు.
జిల్లా, జోన్ క్యాడర్‌లుగా నిర్ధారణ
ఒంగోలువిద్య, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు మునిసిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వర్గీకరణ పూర్తయింది. వీరిని జిల్లా, జోన్ కేడర్లుగా నిర్ధారించారు. విభజిత జిల్లాలకు ఉమ్మడి జిల్లాల నుంచి టీచర్లను కేటాయించాల్సి ఉన్నందున మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థలకు క్యాడర్ నిర్ధారణకు సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు. క్యాడర్ల వారీగా పోస్టులను విభజించారు. జిల్లా క్యాడర్‌గా స్కూలు అసిస్టెంట్ గణితం, ఫిజికల్ సైన్స్, బయోలా జికల్ సైన్స్, సోషల్, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, తమిళం, సంస్కృతం, మోడల్ ప్రైమరీ స్కూలు హెచ్‌ఎం, ఎస్‌జీటీ, పీఈటీ, లాంగ్వేజ్ పండిట్ గ్రేడ్-2, ఆర్ట్, డ్రాయింగ్, క్రాప్టు, మ్యూజిక్, వీవింగ్, కుట్టు, టైలరింగ్, ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్లు, ల్యాబ్ లైబ్రరీ, అసిస్టెంట్ పోస్టులను గుర్తించారు. ఈ పోస్టుల నియామకాలు, బదిలీలు జిల్లా విద్యాశాఖాధికారి చేపడతారు. మునిసిపల్ హైస్కూల్స్ హెచ్‌ఎంలను జోనల్ క్యాడర్‌గా గుర్తించారు. వీరి నియామకాలు, బదిలీలు జోనల్ సీనియారిటీ ఆధారంగా జరుగుతుంది. వీరి నియామక, బదిలీల అధికారాలు పాఠశాల విద్య ప్రాంతీయ సంచాలకులకు ఉంటాయి. డైరెక్టు రిక్రూట్‌మెంట్‌లో స్థానిక అభ్యర్థులకు 95శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. రిక్రూట్‌మెంట్ నియామకాలు, సీనియారిటీ, పదోన్నతులు, బదిలీలు తదితర సర్వీసు అంశాలకు సంబంధించి ఆయా జిల్లా లేదా జోన్‌లు విడివిడిగా ప్రత్యేక యూనిట్లుగా పరిగణిస్తారు. విభజిత కొత్త జిల్లాలకు రిజర్వేషన్ రోస్టర్ మొదటి పాయింట్ నుంచి ప్రారంభమవుతుంది. ఉమ్మడి జిల్లాలకు మాత్రం పాత రోస్టర్ పాయింట్లు కొనసాగుతాయి. ప్రస్తుతం ఏ పాయింట్ ఉందో అక్కడి నుంచే రోస్టర్ కొనసాగుతుంది.