ప్రాణం తీసిన నగదు బట్వాడా మోసం
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:08 PM
నగదు బట్వాడాతో మోసం చేసిన ఓ యువకుడు దాని నుంచి తప్పించుకోలేక బస్సులో నుంచి కిందకు దూకి ప్రాణాలకు ముప్పుతెచ్చుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మేదరమెట్ల నుంచి టంగుటూరుకు ఆర్టీసీ బస్‌లో వెళ్తుండగా టోకరా
గుర్తించి పట్టుకున్న బాధితుడు
తప్పించుకునే క్రమంలో బస్‌లో నుంచి దూకిన యువకుడు
ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి
ఒంగోలు క్రైం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : నగదు బట్వాడాతో మోసం చేసిన ఓ యువకుడు దాని నుంచి తప్పించుకోలేక బస్సులో నుంచి కిందకు దూకి ప్రాణాలకు ముప్పుతెచ్చుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలలోకి వెళితే.. పంగులూరు మండలం ముప్పవరం గ్రామానికి చెందిన తెలగతోటి గోపినాథ్(24) ఒంగోలులో ఓ ప్రైవేటు వైద్యశాలలో అత్యవసర విభాగంలో టెక్నీషియన్‌గా పనిచేశాడు. ప్రస్తుతం అక్కడ ఉద్యోగం మానేసి మరోచోట ప్రయత్నం చేస్తున్నాడు. మోసాలు చేయడం అలవాటు ఉన్న గోపినాథ్ ఈ నెల 3న ఆర్టీసీ బస్సులో మేదరమెట్ల నుంచి టంగుటూరు వెళ్లేందుకు బస్ ఎక్కాడు. ముంగర మురళీకృష్ణ అనే వ్యక్తి వెనుక సీట్లో గోపినాథ్ కూర్చున్నాడు. ఈ క్రమంలో మురళీకృష్ణకు రూ.200 నగదు ఇచ్చి ఫోన్‌పే చేయించుకున్నాడు. ఆ సమయంలో ఫోన్‌పే పాస్‌వర్డ్‌ను గుర్తించిన గోపినాథ్ కొద్దిసేపు తరువాత వేరేవాళ్లకు కాల్ చేయాలని మురళీకృష్ణ వద్ద ఫోన్ తీసుకున్నాడు. అనంతరం ఆ ఫోన్ నుంచి రూ.90 వేల నగదును వేరే నంబరుకు బదిలీ చేసుకున్నాడు. అదేసమయంలో సుమారు 15 నిమిషాలపాటు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. తిరిగి మురళీకృష్ణ ఫోన్ తీసుకొని పరిశీలించగా తన ఫోన్ నుంచి రూ.90 వేలు నగదు బదిలీ తెలియని నంబర్‌కు బదిలీ అయినట్లు గుర్తించి గోపినాథ్‌ను నిలదీశాడు. ఈ క్రమంలో బస్ ఒంగోలు నగర పరిధిలోని గుంటూరు రోడ్డులోకి వచ్చింది. వెంటనే గోపినాథ్ బస్‌లో నుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. అతనిపై ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున రిమ్స్‌లో మృతి చెందాడు. మోసం చేసేందుకు ప్రయత్నించి ప్రాణాలను తీసుకోవడం గమనార్హం.