ఆక్వా రైతులపై భారం పడకుండా చూడాలి
ABN , Publish Date - Jun 16 , 2026 | 11:57 PM
గతంలో ఎన్నడూ లేని విధంగా ఆక్వా రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, పెంచిన ఫీడ్ ధరలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా రొయ్యలు రైతుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు.
కలెక్టర్‌ను కోరిన సంఘం నాయకులు
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : గతంలో ఎన్నడూ లేని విధంగా ఆక్వా రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, పెంచిన ఫీడ్ ధరలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా రొయ్యలు రైతుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. మంగళవారం ప్రకాశం భవన్‌లో కలెక్టర్ పీ రాజాబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఒక వైపు ఎగుమతిదారులు ఇరాన్ యుద్ధ పరిస్థితులను బూచిగా చూపిస్తూ మార్కెట్లో భయాందోళనలు సృష్టించగా, మరో వైపు ఆ పరిస్థితిని ఆసరాగా చేసుకొని రైతుల్లో అనిశ్చితిని పెంచి రొయ్యల ధరలను కనిష్ట స్థాయికి పడిపోయేలా చేసి ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఫీడ్ తయారీ సంస్థలు ఏకపక్షంగా ధరలను పెంచడంతో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ చర్యలతో ఆక్వా రంగం మనుగడకు ప్రమాదం ఏర్పడిందన్నారు. ఫీడ్ కంపెనీలు, రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు ఆక్వా రంగాన్ని స్థిరీకరించే విధానాలను అమలు చేయాలని, రైతులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఈదర యశ్వంత్‌కుమార్‌తో పాటు సంఘం నాయకులు ఉన్నారు.