Share News

కదిలిన కేడర్‌

ABN , Publish Date - Aug 05 , 2026 | 03:08 AM

రెండేళ్ల కూటమి పాలన విజయాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా టీడీపీ చేపట్టిన ఇంటింటి కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ కేడర్‌ కదిలింది. నియోజకవర్గ కీలక నేతలు పూర్తిస్థాయిలో పాల్గొనే అవకాశం లేకపోయినప్పటికీ వివిధ ప్రాంతాల్లోని పార్టీ కేడర్‌ మాత్రం జోరుగా కొనసాగిస్తోంది.

కదిలిన కేడర్‌
రుద్రవరంలో ఇంటింటికీ వెళ్లి సంక్షేమ విజయాలపై కరపత్రాలను పంపిణీ చేస్తున్న సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌, టీడీపీ నేతలు

జోరుగా ఇంటింటికీ టీడీపీ

రెండు జిల్లాల్లో సగటున 27.60 శాతం గృహాలు ఇప్పటికే సందర్శన

కనిగిరిలో ఏకంగా 70.85శాతం పూర్తి

ఒంగోలులో 40.19శాతం, మార్కాపురంలో 39.90శాతం

రాష్ట్రంలో మూడో స్థానంలో కనిగిరి

9వ స్థానంలో ఒంగోలు నియోజకవర్గం

ఉమ్మడి జిల్లాలో వెనుకబడిన కొండపి, అద్దంకి, ఎస్‌ఎన్‌పాడు సెగ్మెంట్లు

రెండేళ్ల కూటమి పాలన విజయాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా టీడీపీ చేపట్టిన ఇంటింటి కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ కేడర్‌ కదిలింది. నియోజకవర్గ కీలక నేతలు పూర్తిస్థాయిలో పాల్గొనే అవకాశం లేకపోయినప్పటికీ వివిధ ప్రాంతాల్లోని పార్టీ కేడర్‌ మాత్రం జోరుగా కొనసాగిస్తోంది. ఇప్పటికే రెండు జిల్లాల్లో సగటున 27.60శాతం గృహాలను సందర్శించారు. కనిగిరి నియోజకవర్గం ఏకంగా 70.85శాతం గృహ సందర్శన పూర్తిచేయడం ద్వారా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. 40.19శాతంతో ఒంగోలు 9వ స్థానంలో ఉంది. అలా రాష్ట్రంలో అత్యధిక గృహాలు సందర్శించిన జాబితాలో ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాలు నిలిచాయి.

ఒంగోలు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు ప్రజానీకం చరమగీతం పాడి టీడీపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి పట్టం కట్టి ఈ ఏడాది జూన్‌ 12కు రెండేళ్లు పూర్తయ్యింది. ఆ నెలాఖరు వరకు రెండేళ్ల కూటమి ప్రభుత్వ ఉత్సవాలను నియోజకవర్గ, జిల్లాస్థాయిలో నిర్వహించారు. అనంతరం జూలై తొలివారంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని టీడీపీ అధిష్ఠానం రూపొందించింది. ఆ సమయంలో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌) నడుస్తుండటంతో జూలై 27 నుంచి 45 రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధానంగా రెండేళ్ల పాలనలో ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో సాధించిన విజయాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రతి ఇంటికీ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లి ప్రభుత్వ విజయాలపై ముద్రించిన కరపత్రాలు అందించడంతోపాటు ఆ ప్రాంతంలో అమలు చేసిన కార్యక్రమాలను వారికి వివరిం చడం ఆ సందర్భంగా చేయాలి. ప్రతి ఇంటినీ సందర్శించిన దానికి గుర్తుగా ఫొటోలను మై టీడీపీ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. పోలింగ్‌ బూత్‌ యూనిట్‌గా రోజుకు 30 ఇళ్లను సందర్శించేలా షెడ్యూల్‌ ఇచ్చారు. మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, అలాగే వివిధ స్థాయిల్లోని నాయకులంతా పాల్గొనాలని అధిష్ఠానం ఆదేశించింది.

కీలక నేతలు లేకున్నా సరే..

జిల్లాలో ‘ఇంటింటికీ’ కార్యక్రమ విజయవంతం కోసం టీడీపీ కీలక నేతలు పెద్దఎత్తున కసరత్తు చేశారు. తొలిరోజైన గత నెల 27న ఉమ్మడి జిల్లాలో మంత్రులు డాక్టర్‌ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు అంతా పాల్గొన్నారు. అనంతరం అత్యధికులు భోగాపురంలో ప్రధాని సభ విజయవంతంపై అధిష్ఠానం ఇచ్చిన బాధ్యతల ప్రకారం అక్కడికి వెళ్లారు. తిరిగి వచ్చాక మళ్లీ సోమవారం నుంచి పాల్గొంటున్నారు. అయితే నియోజకవర్గాలలో కీలక నేతలు ఉన్నా, లేకున్నా ఎక్కడికక్కడ మండల, క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు మాత్రం జోరుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రోజువారీ ఏ గ్రామంలో ఎలా జరుగుతుందన్న విషయాన్ని కొందరు కీలక నేతలు మాత్రమే పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజక వర్గాల్లో అత్యధికంగాను, మరికొన్ని చోట్ల పరిమితంగాను ఈ కార్యక్ర మం సాగడానికి అదే ప్రధాన కారణమని తెలుస్తోంది.

వెనుకబడిన ఎస్‌ఎన్‌పాడు

ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పరిశీలిస్తే.. మొత్తం 7,47,958 గృహాలు ఉండగా టీడీపీ కేంద్ర కార్యాలయ సమాచారం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం వరకు 2,06,380 ఇళ్లను కార్యకర్తలు సందర్శించారు. 70.85శాతం గృహాల సందర్శనకు పూర్తిచేయడం ద్వారా కనిగిరి నియోజకవర్గం ఉమ్మడి జిల్లాలో ప్రథమ స్థానాన్ని, 40.19 శాతంతో ఒంగోలు రెండో స్థానంలో నిలిచాయి. రాష్ట్రంలో మూడో స్థానంలో కనిగిరి, 9వ స్థానంలో ఒంగోలు ఉన్నట్లు సమాచారం. మిగిలిన వాటిలో మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న కొండపి, అద్దంకితోపాటు ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గం వెనుకబడిపోయాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో 15శాతంలోపు మాత్రమే గృహాల సందర్శన జరిగింది. మంత్రులు పని ఒత్తిడితో పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమంపై దృష్టిపెట్టలేకపోగా ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ ఇప్పటివరకు ఒక్క ప్రధాని సభ రోజున మినహా అన్ని రోజులు స్వయంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయినా ఆ నియోజకవర్గం ఉమ్మడి జిల్లాలో చివరి స్థానంలో నిలిచింది. కేవలం 8.53శాతం గృహాలు సందర్శనే అక్కడ మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తయినట్లు సమాచారం. ఎమ్మెల్యే చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ క్షేత్రస్థాయి నాయకులలో కదలిక అంతగా లేనట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితే కొండపి, అద్దంకిలతోపాటు వైపాలెం, దర్శిలోనూ కనిపిస్తోంది.

Updated Date - Aug 05 , 2026 | 03:08 AM