గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యాపారి మృతి
ABN , Publish Date - Mar 08 , 2026 | 11:26 PM
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యాపారి మృతి చెందిన సంఘటన ఆదివారం తెల్లవారు జామున మద్దిపాడు వద్ద చోటుచేసుకుంది.
మద్దిపాడు, మార్చి 8(ఆంధ్రజ్యోతి) : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యాపారి మృతి చెందిన సంఘటన ఆదివారం తెల్లవారు జామున మద్దిపాడు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి... వెల్లంపల్లి గ్రామానికి చెందిన శివప్రసాదు(38) ఈ సంఘటనలో మృతి చెందాడు. శివప్రసాదు ఒంగోలులో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి బాగా పొద్దుపోయే వరకు షాపు నిర్వహించి ఇంటికి టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనం మీద వస్తున్న క్రమంలో మద్దిపాడు ఫ్లైవోవర్ వద్దకు రాగానే వెనుకవైపు నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్‌ఐ వెంకట సూర్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు.