మండుతున్న కూరగాయలు
ABN , Publish Date - Oct 10 , 2026 | 01:42 AM
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వేసవిలో ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు కూడా అదేవిధంగా దడపుట్టిస్తున్నాయి. జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొనడంతో కూరగాయల సాగు గణనీయంగా తగ్గింది.
ఏ రకం కొనాలన్నా కిలో రూ.50పైనే ధర
తోపుడు బండ్లపై పావు కిలో రూ.20పైనే!
ఎల్‌నినో ప్రభావంతో తగ్గిన ఉత్పత్తి
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వేసవిలో ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు కూడా అదేవిధంగా దడపుట్టిస్తున్నాయి. జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొనడంతో కూరగాయల సాగు గణనీయంగా తగ్గింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా కూరగాయలు కొనాలంటేనే సామాన్య ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఏరకం కూరగాయ కొనుగోలు చేయాలన్నా సరాసరిన కిలో రూ.50పైనే పలుకుతోంది. ఇక ఇళ్ల వద్దకు వచ్చే తోపుడు బండ్లు, ఇతరత్రా చిరు వ్యాపారులు పావు కిలో రూ.20పైనే విక్రయిస్తున్నారు. దీంతో జనం కూరగాయలు కొనాలంటేనే ఆలోచిస్తున్నారు. సాధారణంగా ఈ సమయంలో వర్షాలు సమృద్ధిగా కురిసి అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో కూరగాయల ధరలు ఉంటాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. రెండు, మూడు రకాల కూరగాయలు కిలో రూ.40లోపు ఉండగా మిగిలిన అన్నిరకాల ధరలు కిలో చొప్పున కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఒక కుటుంబానికి ఐదారు రకాలు కూరగాయలు తెచ్చుకోవాలంటే కనీసం రూ.250 నుంచి రూ.300 వరకు వెచ్చించాల్సి వస్తోంది. మార్కెట్‌లో పెద్దచిక్కుళ్లు అత్యధికంగా కిలో రూ.100 పలుకుతుండగా వంకాయలు, పచ్చిమిర్చి, చిన్న చిక్కుళ్లు కిలో ధర రూ.60పైన ఉంది. బెండ, బీట్‌రూట్, క్యారెట్, కాకర వంటివి కిలో రూ.50పైన పలుకుతున్నాయి. టమాటా ధర కిలో రూ.40, దోస కిలో రూ.40, బంగాళదుంప కిలో రూ.35గా ఉంది. చిల్లర వ్యాపారులు కిలో రూ.80 వరకూ విక్రయిస్తున్నారు.