Share News

భవనాలు, ఖాళీ స్థలాలు

ABN , Publish Date - Mar 07 , 2026 | 01:41 AM

మార్కాపురం జిల్లా ఏర్పాటయ్యాక నూతన భవనాల సమస్య ముందుకొచ్చింది. ఎక్కడ ఏ కార్యాలయం ఏర్పాటు చేయాలి? అనే సమస్య ఉత్పన్నమైంది. పాలన మార్కాపురానికి చేరేనాటికి జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన వసతులపై ముందుస్తుగా ఏ శాఖా దృష్టి సారించలేదు.

భవనాలు, ఖాళీ స్థలాలు
మార్కాపురంలో కంభం సెంటర్‌కు సమీపంలో ఉన్న పురాతన ఆర్‌అండ్‌బీ భవనం

మార్కాపురంలో అందుబాటులో వనరులు

ఉన్నతాఽధికారులు దృష్టి సారిస్తే సద్వినియోగం

ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ఇబ్బందులను అధిగమించే అవకాశం

మార్కాపురం టౌన్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం జిల్లా ఏర్పాటయ్యాక నూతన భవనాల సమస్య ముందుకొచ్చింది. ఎక్కడ ఏ కార్యాలయం ఏర్పాటు చేయాలి? అనే సమస్య ఉత్పన్నమైంది. పాలన మార్కాపురానికి చేరేనాటికి జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన వసతులపై ముందుస్తుగా ఏ శాఖా దృష్టి సారించలేదు. డివిజన్‌ కార్యాలయాలనే తాత్కాలికంగా జిల్లా కార్యాలయాలుగా మార్చారు. కలెక్టర్‌, ఎస్పీ ఆఫీసులను మాత్రం ఇబ్బందులు లేకుండా త్వరితగతిన తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. మిగిలిన ప్రభుత్వశాఖలకు చెందిన కార్యాలయాలకు భవనాలు, స్థలాల కోసం అన్వేషిస్తున్నారు. మార్కాపురం పట్టణంలో ఉన్న కొన్ని శాఖలకు చెందిన భవనాలు, స్థలాలను సద్వినియోగం చేసుకుంటే కొంతమేర ఇబ్బందులను అధిగమించేందుకు అవకాశం ఉంది.

పలుచోట్ల పాత భవనాలు, స్థలాలు

మార్కాపురం పట్టణంలో పలు శాఖలకు చెందిన పాత భవనాలు, స్థలాలు కొన్ని అందుబాటులో ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే జిల్లా, డివిజన్‌ కార్యాలయాల ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో రెవెన్యూ శాఖకు చెందిన స్థలాలు కొన్ని ఉన్నాయి. చిన్నపాటి భవనాలను రెవెన్యూ అధికారులు ఉపయోగించుకుంటున్నారు. సుమారు ఎకరాకు పైచిలుకే తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ఖాళీ స్థలాలు ఉన్నాయి. అదే విధంగా ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన పాత భవనాలు, స్థలాలు కూడా విరివిగా ఉన్నాయి. స్థానిక ఆర్‌అండ్‌బీ ఈఈ కార్యాలయం, గెస్ట్‌హౌ్‌సకు మధ్యలో పాత భవనం ఉంది. చెరువు అలుగు సమీపంలో పెద్దపాటి షెడ్‌ కూడా ఉంది. కంభం సెంటర్‌లో అటవీశాఖ కార్యాలయాన్ని ఆనుకుని ప్రధాన రహదారిలో విలువైన శిథిలావస్థకు చెందిన భవనం ఉంది. పంచాయతీరాజ్‌ ఈఈ కార్యాలయం కాంపౌండ్‌లో సుమారు ఎకరం మేర ఖాళీ స్థలం ఉంది. మునిసిపాలిటీకి సంబంధించి పట్టణాన్ని ఆనుకుని వెళ్తున్న జాతీయ రహదారి పక్కన సుమారు 3 ఎకరాల మేర భూమి ఉంది. దేవదాయశాఖకు చెందిన భూములు పట్టణాన్ని ఆనుకుని సుమారు 20 ఎకరాల వరకు ఉన్నాయి. ఆక్రమణల చెరలో మరో 30 ఎకరాల మేర భూమి ఉంది. ఇవికాక పలు శాఖలకు చెందిన స్థలాలు, భూములు కూడా అన్యాక్రాంతమైనవి ఉన్నాయి. వాటిపై ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యాలయాల ఏర్పాటుకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని ప్రజలు బావిస్తున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Mar 07 , 2026 | 01:41 AM