యువకుడి దారుణ హత్య
ABN , Publish Date - Oct 18 , 2026 | 03:05 AM
మండల కేంద్రమైన కొనకనమిట్లలో శుక్రవారం రాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాతకక్షలే ఇందుకు కారణమని తెలుస్తోంది.
కొనకనమిట్లలో కలకలం
కొండ సమీపంలో మృతదేహం
పాతకక్షలే కారణం?
కొనకనమిట్ల, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రమైన కొనకనమిట్లలో శుక్రవారం రాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాతకక్షలే ఇందుకు కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. కొనకనమిట్లకు చెందిన పొనుగోటి నవీన్‌రెడ్డి (24) వ్యవసాయం చేస్తుంటాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. శనివారం ఉదయం ఆయన మృతదేహాన్ని గ్రామ సమీపంలోని కొండప్రాంతంలో గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహంపై గాయాలు, కాళ్లు విరిగి ఉండడంతో హత్య చేసి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. రెండు సంవత్సరాల నుంచి పొలంగట్లు, బోరు విషయంలో తరచూ గొడవలు జరుగుతున్న క్రమంలో గ్రామానికి చెందిన సూరారపు వెంకటేశ్వర్లు, తిరపతయ్య, పొనుగోటి వెంటేశ్వర్లు, పొనుగోటి చంద్రశేఖర్, మరికొంతమంది కలిసి నవీన్‌రెడ్డిని హత్య చేశారని తండ్రి గురవారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నట్లు పొదిలి ఇన్చార్జి సీఐ వినోద్‌కుమార్ తెలిపారు. పోస్టుమార్టం నిమత్తం మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నవీన్‌రెడ్డి తండ్రి ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఈ ఘటన గ్రామంలో కలకలం సృష్టించింది.