మంగమూరులో దారుణ హత్య
ABN , Publish Date - Jun 22 , 2026 | 10:37 PM
మద్యం సేవిద్దామని ఇంటి నుంచి తీసుకెళ్లి ఓ యువకుడిని హత్య చేశారు. ఈ సంఘటన సంతనూతలపాడు మండలం మంగమూరులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
పథకం ప్రకారం అర్ధరాత్రి ఓ యువకుడిని కత్తితో పొడిచిన బంధువులు
ఆందోళనకు దిగిన హతుని కుటుంబ సభ్యులు
పోలీసులు అదుపులో ముగ్గురు అనుమానితులు?
ఒంగోలు క్రైం, జూన్ 22(ఆంధ్రజ్యోతి) : మద్యం సేవిద్దామని ఇంటి నుంచి తీసుకెళ్లి ఓ యువకుడిని హత్య చేశారు. ఈ సంఘటన సంతనూతలపాడు మండలం మంగమూరులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే... మంగమూరులోని అంబేద్కర్ నగర్‌కు చెందిన అశోక్ పెయిటింగ్ పనులు చేస్తుంటాడు. అతని ఇంటికి ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో మధు అనే వ్యక్తి బైక్‌పై వచ్చి బయటకు తీసుకెళ్లారు. ఇరువురు పేర్నమిట్ట వెళ్లి మద్యం కొన్నారు. మంగమూరుకు పడమరగా ఉన్న నాగార్జునసాగర్ కాలువ సమీపంలో పొలాల్లోకి వెళ్లి మద్యం తాగుతున్నారు. అక్కడకు ఐదుగురు యువకులు బైక్‌లపై వెళ్లి మారణాయుధాలతో అశోక్‌పై దాడి చేశారు. అదేసమయంలో అక్కడ ఉన్న కంకణాల మధు.. అశోక్ భార్యకు ఫోన్ చేసి మీ భర్తను కత్తులతో ఎవరో పొడిచారు.. అక్కడే ఇంకొంతమంది పడిపోయి ఉన్నట్లు చెప్పాడు. అంతేకాక ఇంటికి వచ్చి అశోక్ తల్లి సుశీల, బంధువులకు చెప్పి ఘటనాస్థలానికి తీసుకెళ్లాడు. అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్న అశోక్ మృతి చెందినట్లు గుర్తించారు. శరీరంపై నాలుగు కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు.
పథకం ప్రకారమే హత్య
తన బిడ్డను పథకం ప్రకారం హత్య చేశారని అశోక్ తల్లి సుశీల, బంధువులు ఆరోపిస్తున్నారు. అంబేద్కర్‌నగర్‌కు చెందిన అల్లడి చందు, పెయ్యల సతీష్, అలూరి సంతో్‌షతో పాటు మరో ఇరువురు యువకులు కత్తులు, రాడ్‌లతో దాడి చేసి హతమార్చారని ఆరోపిస్తున్నారు.
వివాహేతర సంబంధమే కారణమా?
అశోక్‌ను హత్య చేయడానికి వివాహేతర సంబంధమే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులలో ఓ యువకుడి రక్త సంబంధీకులతో అశోక్‌కు వివాహేతర సంబంధం ఉండటంతో పలుమార్లు హెచ్చరించిన తరువాత పథకం ప్రకారం హత్యకు పాల్పడ్డారు అనీ ప్రచారం జరుగుతోంది.
పోలీసులు న్యాయం చేయడం లేదని ఆందోళన
పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని హతుడు బంధువులు ఆందోళనకు దిగారు. సోమవారం స్థానిక రిమ్స్ వద్ద అశోక్ తల్లి, మేనమామ పలువురు మీడియాతో మాట్లాడారు. తాము ఇచ్చినట్లు పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదని ఆరోపించారు. కొంచెంసేపు రిమ్స్ వద్ద ఆందోళన చేసి, ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయలని డిమాండ్ చేశారు.
అదుపులో ముగ్గురు?
పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్యకు గల కారణం, ఎలా హత్య చేశారు, ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మిగిలిన వారి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఒంగోలు రూరల్ సీఐ శేషగిరిరావు తెలిపారు. ఎలాంటి అపోహలకు తావులేదని చెప్పారు. విచారణలో వాస్తవం బయటకు వస్తుందని చెప్పారు.