బేస్తవారపేటలో దారుణ హత్య
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:16 AM
ఇంట్లో నిద్రిస్తుండగా ఒక వ్యక్తిపై గొడ్డలి, కత్తులతో దారుణంగా హత్య చేసిన ఘటన బేస్తవారపేటలో చోటుచేసుకుంది. హత్య చేశాక మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టి దుప్పటి కప్పి వెళ్లారు.
అతని సహచరుడు పరార్.. కేసు నమోదు చేసిన పోలీసులు
బేస్తవారపేట, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : ఇంట్లో నిద్రిస్తుండగా ఒక వ్యక్తిపై గొడ్డలి, కత్తులతో దారుణంగా హత్య చేసిన ఘటన బేస్తవారపేటలో చోటుచేసుకుంది. హత్య చేశాక మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టి దుప్పటి కప్పి వెళ్లారు. వివరాల్లోకెళ్తే... బేస్తవారపేట పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీలో ఓ రేకులషెడ్‌ను స్నేహితులైన జయంపు కృష్ణయ్య(తర్లుపాడు మండలం తాడివారిపల్లె), కొమరోలు చిన్నరంగయ్య ఇద్దరూ అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నారు. వారు పొట్టేళ్లు కొనుగోలు చేసి మాంసం విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో వారిద్దరూ డిసెంబరు 31న అర్ధ్ధరాత్రి మద్యం సేవించి గొడవకు దిగినట్లు సమాచారం. అదేరోజు అర్ధరాత్రి జయంపు కృష్ణయ్య(68)ని గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. ఒక చేయ్యి నరికి తలకింద పెట్టారు. నోటి ప్రాంతంలో పెదవులపై నరికారు. మృతి చెందిన కృష్ణయ్యను మంచంపై పెడుకోబెట్టి దుప్పటి కప్పారు. అదేక్రమంలో అంటే నూతన సంవత్సరం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో కొమరోలు చిన్న రంగయ్య మద్యం సేవించి బస్టాండ్ ప్రాంతంలో పలువురిపై ఘర్షణకు దిగినట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం రేకులషెడ్ నుంచి దుర్వాసన వెలువడడంతో చుట్టుపక్కల వారు చూడగా కృష్ణయ్యను హత్య చేసి దుప్పటి కప్పినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు వెళ్లి ఆధారాలు సేకరించారు. కాగా కొమరోలు చినరంగయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ కలిసే ఉంటారని అయితే కృష్ణయ్య హత్యకు కారణం తెలియడంలేదు. పరారీలో ఉన్న రంగయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనా స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ నాగరాజు, కంభం సీఐ మల్లికార్జునరావు, ఎస్‌ఐ రవీంద్రారెడ్డి పరిశీలించి కేసు నమోదుచేశారు. డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ కృష్ణయ్య హత్య జరిగిన రోజు నుంచి రంగయ్య కనిపించకపోవడంపై గాలింపు చర్యలు చేపట్టామన్నారు. కృష్ణయ్య తమ్ముడు అంకయ్య ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసుగా నమోదు చేసినట్లు తెలిపారు.
పురుగుల మందు తాగిన యువకుడు మృతి
ఉలవపాడు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : సౌత్‌ఆఫ్రికాలోని ఒక ప్రయివేటు కంపెనీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ స్వగ్రామం వచ్చిన యువకుడు తిరిగి ఆ దేశానికి వెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారనే ఆగ్రహంతో పురుగుల మందుతాగి చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని చాగొల్లు గ్రామానికి చెందిన వల్లెపు వంశీకృష్ణ(27) సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రయివేటు కంపెనీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. గత ఏడాది ఆగస్టులో స్వగ్రామం చాగొల్లుకు వచ్చాడు. మళ్లీ వెళ్లి ఉద్యోగంలో చేరతాను అందుకు అవసరమైన డబ్బులు ఇవ్వాల్సిందిగా తండ్రి శ్రీనివాస్, తాత వెంకటసుబ్బారావులను నెల నుంచి అడుగుతున్నాడు. అందుకు కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు. ఇక్కడే పని చూసుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోతానని బెదిరించిన వంశీకృష్ణ ఇంట్లో పొలం పనులకు తెచ్చిపెట్టి ఉన్న గడ్డిమందును గత నెల 21న తాగాడు. యువకుడిని హుటాహుటిన ఉలవపాడు సీహెచ్‌సీకి తీసుకురాగా, అక్కడ్నుంచి ఒంగోలు, ఆతర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం మృతిచెందాడు. 13 రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందిన వంశీకృష్ణ విషయమై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై సుబ్బారావు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.