తెచ్చింది 3,843.. కొనుగోలు 2,106
ABN , Publish Date - May 07 , 2026 | 02:35 AM
దక్షిణాది పొగాకు మార్కెట్లో బేళ్ల తిర స్కరణలు ఏమాత్రం ఆగడం లేదు. వేలంలో బోర్డు అధికారులు సూచించిన ధరకు కొనేందుకు బయ్యర్లు ముందుకు రాకపోవడంతో వాటిని అధికారే నోబిడ్ చేస్తున్నారు. అలాంటివి బుధవారం వేలానికి వచ్చిన బేళ్లలో దాదాపు 35 నుంచి 40శాతం ఉన్నాయి.
పలుకేంద్రాల్లో సగానికిపైగా పొగాకు బేళ్ల తిరస్కరణ
మొత్తంగా 45.20 శాతం వెనక్కి.. నోబిడ్‌లే అధికం
ఒంగోలు, మే 6 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్లో బేళ్ల తిర స్కరణలు ఏమాత్రం ఆగడం లేదు. వేలంలో బోర్డు అధికారులు సూచించిన ధరకు కొనేందుకు బయ్యర్లు ముందుకు రాకపోవడంతో వాటిని అధికారే నోబిడ్ చేస్తున్నారు. అలాంటివి బుధవారం వేలానికి వచ్చిన బేళ్లలో దాదాపు 35 నుంచి 40శాతం ఉన్నాయి. మరో పదిశాతం వరకు ఇతర పలు కారణాలతో తిరస్కరణలు జరిగాయి. మూడు జిల్లాల పరిధిలో ఉన్న 11వేలం కేంద్రాలకు బుధవారం అమ్మకాలకు 3,843 బేళ్లను రైతులు తీసుకువచ్చారు. వాటిలో 2,106 బేళ్లను మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. వివిధ రకాల కారణాలతో 1,737 తిరస్కరించారు. అంటే అమ్మకాలకు తెచ్చిన వాటిలో సుమారు 45.20శాతం వ్యాపారులు కొనుగోలు చేయక రైతులు తిరిగి ఇళ్లకు తీసుకెళ్లాల్సి వచ్చింది. తిరస్కరణలు జరిగిన వాటిలో అధికారులు సూచించిన ధరకు బయ్యర్లు కొనుగోలు చేయక నోబిడ్ అవుతున్నవి గణనీయంగా ఉంటున్నాయి. బుధవారం నాటి వేలం ప్రక్రియలో తిరస్కరణలు జరిగిన 1,737లో 1,453 నోబిడ్‌లు ఉండటం మార్కెట్ పరిస్థితిని తెలియజేస్తోంది. మొత్తంగా వేలానికి వచ్చిన బేళ్లలో నోబిడ్‌లు దాదాపు 38శాతం ఉన్నాయి. ఇదిలాఉండగా పలు కేంద్రాల్లో కొన్న వాటి కన్నా తిరస్కరించినవే అధికంగా కనిపించాయి. ఎస్‌బీఎస్ రీజియన్‌లోని ఒంగోలు-1లో 55శాతం, వెల్లంపల్లిలో 51శాతం తిరస్కరణలు ఉన్నాయి. ఎస్‌ఎల్‌ఎస్ రీజియన్‌లోని కందుకూరు-1లో ఏకంగా 62.54శాతం, కనిగిరిలో 56.48శాతం, కందుకూరు-2లో 54శాతం, పొదిలిలో 53శాతం తిరస్కరణలు జరిగాయి. గత రెండురోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.