కోల్ సొసైటీలో విచారణకు బ్రేక్
ABN , Publish Date - Feb 05 , 2026 | 02:40 AM
కోల్‌సొసైటీపై విచారణకు బ్రేక్ పడింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన సహకారశాఖ ఒంగోలు అసిస్టెంట్ రిజిస్ర్టార్ సురేంద్ర బాబు బుధవారం రికార్డుల స్వాధీనం కోసం సంస్థ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆయనకు రికార్డులు అప్పగించాల్సిన బిజినెస్ మేనేజర్ అందుబాటులో లేరు.
అందుబాటులో లేని సంస్థ బిజినెస్ మేనేజర్
ఫోన్‌లో సంప్రదించిన అధికారి
సాయంత్రం వరకు చూసి తదుపరి చర్యలకు సిఫార్సు
డీసీసీబీలో సెక్షన్ 51 విచారణ తూతూమంత్రం
ఒంగోలు, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : కోల్‌సొసైటీపై విచారణకు బ్రేక్ పడింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన సహకారశాఖ ఒంగోలు అసిస్టెంట్ రిజిస్ర్టార్ సురేంద్ర బాబు బుధవారం రికార్డుల స్వాధీనం కోసం సంస్థ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆయనకు రికార్డులు అప్పగించాల్సిన బిజినెస్ మేనేజర్ అందుబాటులో లేరు. కార్యాలయంలో రికార్డుల గదికి తాళాలు వేసి ఉండటం చూసి అక్కడ ఉన్న అటెండర్‌ను అడిగి బిజినెస్ మేనేజర్ రాలేదని తెలుసుకున్నారు. విచారణాధికారి సురేంద్ర ఫోన్‌లో బిజినెస్ మేనేజర్‌ను సంప్రదించగా తాను పనిమీద గుంటూరు వెళ్లానని సాయంత్రం లోపు వస్తానని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. వాస్తవానికి ఈనెల 2వ తేదీనే సంబంధిత రికార్డులను విచారణాధికారికి అందించాల్సి ఉంది. అయితే మొక్కుబడిగా రెండు పుస్తకాలు ఇచ్చి అన్ని రికార్డులను బుధవారం ఉదయం 11 గంటలకు అందజేస్తానని రాతపూర్వకంగా ఆరోజు విచార ణాధికారికి బిజినెస్ మేనేజర్ తెలియజేశారు. ఆ ప్రకారం విచారణాధి కారి సురేంద్రబాబు బుధవారం వెళ్లగా అతను అందుబాటులో లేరు. కోల్ సొసైటీపై చేపట్టిన విచారణ నిలుపుదల కోరుతూ పాలక మండలి హైకోర్టును ఆశ్రయించింది. తమకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని, వాటిని తీసుకొచ్చేందుకు 4,5 తేదీలలో బిజినెస్ మేనేజర్‌ను వెళ్లాల్సి ఉన్నందున విచారణాధికారి ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిలువరించాలని సహకార శాఖ జిల్లా అధికారులను సొసైటీ అధ్యక్షురాలు ఉదయలక్ష్మి కోరుతూ లేఖను మంగళవారం ఇచ్చారు. నిబంధనల ప్రకారం అలాంటి ఆదేశాలను అధికారులు విచారణ అధికారికి ఇచ్చే అవకాశాలు లేకపోవడంతో వారు మిన్నకుండిపోయారు. విచారణాధికారి సురేంద్రబాబు బుధవారం కోల్‌సొసైటీ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం వరకు వేచిచూసిన ఆయన బిజినెస్ మేనేజర్ తనను మోసం చేశారన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో సహకార చట్టం సెక్షన్ 120 కింద కోల్‌సొసైటీ బిజినెస్ మేనేజర్‌పై చర్యలకు అనుమతి కోరుతూ ఉన్నతాధికారులకు నివేదించినట్లు సమాచారం. అందుకు వారు అనుమతి ఇస్తే బిజినెస్ మేనేజర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసే అధికారం విచారణాధికారికి ఉన్నట్లు సమాచారం
డీసీసీబీలో విచారణాధికారి తూతూమంత్రంగా పరిశీలన
జిల్లా కేంద్ర సహకార బ్యాంకుపై చేపట్టిన సెక్షన్ 51 విచారణ తూతూమంత్రంగా సాగుతోంది. విచారణాధికారి అయిన రాష్ట్ర సహకార శాఖ అడిషనల్ కమిషనర్ గౌరీశంకర్ మరోసారి బుధవారం ఆ విచారణకు వచ్చారు. బ్యాంకు సీఈవో, సహకార శాఖ సిబ్బందితో కలిసి డీసీసీబీ ఒంగోలు లాయర్‌పేట, బి.నిడమానూరు బ్రాంచిలను సందర్శించారు. వాటి పరిధిలో రుణాలు ఇచ్చిన కొన్ని గ్రూపుల వారిని విచారించే పేరుతో గౌరీశంకర్ వచ్చారు. అయితే రెండు,మూడు గ్రూపులకు చెందిన వారు మాత్రమే వచ్చినట్లు సమాచారం. విచారణాధికారి తీరు డీసీసీబీలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు తేల్చేవిధంగా కాకుండా అక్రమార్కులకు వత్తాసుగా సాగుతుందన్న విమర్శలు తొలినుంచి వ్యక్తమవుతున్నాయి. మొత్తం విచారణకు నాలుగు నెలలు గడువును ఆయనకు ఇవ్వగా మరో రెండు మాసాలు కావాలని తీసుకొన్నారు. అదికూడా మరో పది రోజుల్లో పూర్తికానుంది. ఇంతవరకు ఒక్క అంశంపై కూడా నిర్థిష్టంగా విచారణ చేసిన దాఖలాలు లేవు. ఈనేపథ్యంలో మరికొంతకాలం గడువు కోరేందుకు బుధవారం వచ్చి మొక్కుబడిగా విచారణ తంతు కొనసాగించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.