రేపు భూమి పూజ
ABN , Publish Date - May 05 , 2026 | 03:10 AM
తెలుగుదేశం పార్టీఒంగోలు పార్లమెంట్ కార్యాలయ భవన నిర్మాణానికి ఈనెల 6వ తేదీన భూమిపూజ నిర్వహిస్తున్నట్లు కనిగిరి ఎమ్మెల్యే, ఆపార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఒంగోలులో టీడీపీ కార్యాలయ నిర్మాణానికి ఏర్పాట్లు
ఉమ్మడి ప్రకాశం నుంచి శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావాలి
కనిగిరి ఎమ్మెల్యే, పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ ఉగ్ర
నెల్లూరు మహానాడును విజయవంతం చేయాలి : సత్య
ఒంగోలు కార్పొరేషన్, మే 4 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీఒంగోలు పార్లమెంట్ కార్యాలయ భవన నిర్మాణానికి ఈనెల 6వ తేదీన భూమిపూజ నిర్వహిస్తున్నట్లు కనిగిరి ఎమ్మెల్యే, ఆపార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమిపూజకు బుధవారం ఉదయం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిపారు. 44 ఏళ్ల పార్టీ చరిత్రలో ఒంగోలులో సొంత భవనం నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రెండు ఎకరాల స్థలంలో రూ.3 కోట్ల వ్యయంతో బుధవారం ఉదయం 10.30 గంటలకు స్థానిక భాగ్యనగర్ 4వలైను 11వ అడ్డరోడ్డులో కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. ఆరు నెలల్లో నిర్మాణ పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ మండల నాయకులు, జిల్లాస్థాయి అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరై విజయంతం చేయాలని కోరారు.
వైసీపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి
మార్కాపురంలో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టి కృష్ణా జలాలు, వెలిగొండ పనులు తదితర అంశాలపై తెలుగుదేశం పార్టీని విమర్శించడాన్ని డాక్టర్ ఉగ్ర ఖండించారు. మెడికల్ కాలేజీ పనులు జరగకుండా కాంట్రాక్టర్లను బెదిరించడం, వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసినట్లు చెప్పుకున్న వైసీపీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. కృష్ణాజలాలు, వెలిగొండపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు.
రేపు నెల్లూరులో మహానాడు పనులు ప్రారంభం
మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ ఒంగోలు పార్లమెంటు కార్యాలయ భవన శంకుస్థాపన పనులకు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని తెలిపారు. పార్టీ శ్రేణులందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల న్నారు. ఈ ఏడాది మహానాడు నెల్లూరు జిల్లాలో జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ 5లక్షల మందితో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. మహానాడు పనులను బుధవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మహానాడును విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు పాల్గొన్నారు.