Share News

నేడు టీడీపీ కార్యాలయానికి భూమిపూజ

ABN , Publish Date - May 06 , 2026 | 02:45 AM

నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లా టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్న ఆ పార్టీ సొంత కార్యాలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. సుమారు 8వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒంగోలులో నిర్మించ నున్న కార్యాలయ భవనానికి బుధవారం పునాదిరాయి వేయనున్నారు.

నేడు టీడీపీ కార్యాలయానికి భూమిపూజ
ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర, ఇతర టీడీపీ నేతలు

హాజరుకానున్న ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర కీలక ప్రజాప్రతినిధులు

తుది ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

ఒంగోలు, మే 5 (ఆంధ్రజ్యోతి) : నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లా టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్న ఆ పార్టీ సొంత కార్యాలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. సుమారు 8వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒంగోలులో నిర్మించ నున్న కార్యాలయ భవనానికి బుధవారం పునాదిరాయి వేయనున్నారు. శాస్త్రోక్తంగా ఉదయం 9.30 గంటలకు భూమిపూజ నిర్వహించాలని పార్టీ ముఖ్యనేతలు నిర్ణయించారు. నగరంలోని భాగ్యనగర్‌లో ఉన్న ఏసీబీ కార్యాలయ సమీపంలో రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం లీజు ప్రాతిపదికన కేటాయిం చడంతో అక్కడ కార్యాలయ నిర్మాణం చేపడుతు న్నారు. ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి నేతృత్వంలో సదరు స్థలంలో భూమిపూజకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది బాగా లోతట్టు కావడంతోపాటు చిల్లచెట్లు అధికంగా ఉండటంతో ఎక్స్‌కవేటర్‌తో జంగిల్‌ క్లియరెన్స్‌ చేశారు. అలాగే గ్రానైట్‌ డస్ట్‌ తోలి చదును కూడా చేశారు. తుది ఏర్పాట్లను డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి, పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, ఇతర నాయకులు మంగళవారం సాయంత్రం పర్యవేక్షించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఇతర కార్పొరేషన్ల చైర్మన్లు భూమిపూజ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అన్ని నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులను కూడా ఈ కార్యక్రమానికి పార్టీ తరఫున ఆహ్వానించారు. సకాలంలో పార్టీ శ్రేణులు పాల్గొని భూమిపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్లమెంట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Updated Date - May 06 , 2026 | 02:45 AM