Share News

పోలీసులకు మళ్లీ మస్కా కొట్టిన భీముడు

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:46 AM

మోసాలు చేయడం.. లక్షలు సంపాదించడం.. ఇది మెస్ట్‌ వాంటెడ్‌ భీముడు అజిత్‌కుమార్‌ రెడ్డి నేర ప్రవృత్తి. 2018లో ప్రకాశం జిల్లాలో గ్రానైట్‌ ఫేక్‌ బిల్లులు సృష్టించి వ్యాపారం చేస్తూ అనేక మందిని మోసగించాడు.

పోలీసులకు మళ్లీ మస్కా కొట్టిన భీముడు

నిందితుడిపై 2018లో చీమకుర్తిలో నాలుగు కేసుల నమోదు

ఇటీవల పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి అరెస్టు

ఆరు రోజులు ఒంగోలు జైలులో

ఆ తర్వాత మరో కేసులో తెనాలి కోర్టుకు తరలింపు.. రిమాండ్‌

రేపల్లె సబ్‌ జైలు నుంచి పరారీ

పోలీసుల అదుపులో భీముడు?

ఒంగోలు క్రైం, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి) : మోసాలు చేయడం.. లక్షలు సంపాదించడం.. ఇది మెస్ట్‌ వాంటెడ్‌ భీముడు అజిత్‌కుమార్‌ రెడ్డి నేర ప్రవృత్తి. 2018లో ప్రకాశం జిల్లాలో గ్రానైట్‌ ఫేక్‌ బిల్లులు సృష్టించి వ్యాపారం చేస్తూ అనేక మందిని మోసగించాడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం నాగన్నగూడేనికి చెందిన భీముడు అజిత్‌కుమార్‌రెడ్డి ప్రకాశం జిల్లాలో తన వ్యాపారాన్ని ప్రారంభించారు. మోసాలు చేయడంతోపాటు వ్యాపారులను బురిడీ కొట్టించడం, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడంలో సిద్ధహస్తుడు. అంతే కాదు పోలీసులతోపాటు ఇతర అధికారులను బుట్టలో వేసుకుని తన పబ్బం గడుపుకోవడంలో కూడా అరితేరాడు. పేరుకు మాత్రమే కాదు ఆకారంలో కూడా భీముడిలా భారీ కాయుడు.

ఒంగోలులో 2018 జూలై 11న భీముడు జైలు సిబ్బంది కళ్లుగప్పి ఆసుపత్రి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై అప్పట్లో ఇద్దరు జైలు వార్డర్లు సస్పెండ్‌ అయ్యారు. ఇదిలా ఉండగా, గత నెలలో భీముడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు 2018లో చీమకుర్తి పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్న భీముడిని విజయవాడ నుంచి పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు ఒంగోలులోని జిల్లా జైలుకు గత నెల 18న తరలించారు. అప్పటి నుంచి 24 వరకు జిల్లా జైలులో ఉన్న అజిత్‌కుమార్‌ రెడ్డిని తెనాలి పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకెళ్లారు. గత నెల 28న రేపల్లె సబ్‌ జైలు నుంచి భీముడు పరారయ్యాడు.


గతంలో పరారీ అయిన చరిత్ర

గతంలో ఒంగోలు జైలు సిబ్బందికి నగదు ముట్టజెప్పి వారి ఫోన్‌ నుంచి మాట్లాడుకొని ఛాతీ నొప్పి పేరుతో రిమ్స్‌లో జేరి అక్కడ నుంచి యథేచ్ఛగా ఇన్నోవా కారులో పరారయ్యాడు. అతనికి ఇలాంటి చరిత్ర ఉంది అని తెలిసి కూడా తెనాలి నుంచి రేపల్లె సబ్‌ జైలుకు తరలించడంపై పోలీసుల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మోస్ట్‌ వాంటెడ్‌ను అరెస్టు చేసి ఇతర ప్రాంతాలకు తరలించే వరకు పోలీసు, జైలు సిబ్బంది జాగ్రత్తలు తీసుకోలేదనేది స్పష్టం అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో 32 చీటింగ్‌ కేసులు ఉన్న భీముడిపై పోలీసులు జాగ్రత్తలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి.

పోలీసుల అదుపులో భీముడు

గత నెల 28న రేపల్లి నుంచి తప్పించుకున్న భీముడిని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇతని ఫోన్‌ లావాదేవీలు, కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

చీమకుర్తిలో నాలుగు కేసులు

చీమకుర్తి పోలీసు స్టేషన్‌లో నాలుగు చీటింగ్‌ కేసులు భీముడిపై నమోదయ్యాయి. ఈమేరకు గత నెల 18న విజయవాడ కోర్టులో పీటీ వారెంట్‌ తీసుకొని అతనిని ఒంగోలు తరలించి కోర్టులో హాజరు పరిచారు. అందుకు సంబంధించి రిమాండ్‌లో ఉన్న భీముడిని తెనాలి పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకెళ్లారు.

Updated Date - Apr 25 , 2026 | 12:46 AM