Share News

చేపల చెరువులకు భవనాసి నీరు

ABN , Publish Date - Jul 21 , 2026 | 03:10 AM

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని సంరక్షించేందుకు చర్యలు చేపట్టాల్సిన అధికారులు చోద్యంచూస్తుండటంతో భవనాసి చెరువు ఖాళీ అవుతోంది. ఇక్కడి నీరు చేపల చెరువులకు వెళ్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న పెద్దచెరువులలో భవనాసి ఒకటి.

చేపల చెరువులకు భవనాసి నీరు
భవనాసి నుంచి పైపుల ద్వారా చేపల చెరువుకు పంపింగ్‌ చేస్తున్న నీరు

ఇష్టారాజ్యంగా పంపింగ్‌.. మరోవైపు కరెంటు చౌర్యం

చోద్యంచూస్తున్న ఇరిగేషన్‌, విద్యుత్‌ శాఖ అధికారులు

అద్దంకి, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని సంరక్షించేందుకు చర్యలు చేపట్టాల్సిన అధికారులు చోద్యంచూస్తుండటంతో భవనాసి చెరువు ఖాళీ అవుతోంది. ఇక్కడి నీరు చేపల చెరువులకు వెళ్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న పెద్దచెరువులలో భవనాసి ఒకటి. వేసవిలో కూడా ఎండిపోకుండా ఉంటుండటంతో సమీప గ్రామాలలోని వనరులకు నీటి లభ్యతకు ఇబ్బంది లేకుండా ఉంటోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని భవనాసి చెరువుకు రెండువైపులా చక్రాయపాలెం, శింగరకొండపాలెం, కొత్తరెడ్డిపాలెం తదితర గ్రామాల సమీపంలో వందల ఎకరాలలో ఉన్న చేపల చెరువులకు ఇష్టారాజ్యంగా పంపింగ్‌ చేస్తున్నారు. భవనాసి చెరువు నీటిని సాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా చేపలచెరువులకు మళ్లించినా పట్టించుకునే వారు కరువయ్యారు. మరోవైపు నీటి పంపింగ్‌కు విద్యుత్‌ను వాడుతూ చౌర్యానికి పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మిన్నకుండటం విమర్శలకు తావిస్తోంది. గృహ వినియోగానికి చిన్నపాటి తప్పులు చేస్తేనే వేలకు వేల రూపాయల అపరాధ రుసుం విధించే విద్యుత్‌ శాఖ అధికారులు చేపల చెరువులకు నీటి పంపింగ్‌ కోసం యథేచ్ఛగా విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నా కన్నెత్తి చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. విద్యుత్‌ మోటార్‌లను ఏర్పాటు చేసి భవనాసి చెరువు నీటిని చేపల చెరువులకు పంపింగ్‌ చేస్తున్నా ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోకపోవటం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదేపరిస్థితి కొనసాగితే మరో వారం, పది రోజులలోనే భవనాసి చెరువులోని నీరు మొత్తం ఖాళీ కావడం ఖాయమనే అభిప్రాయం నెలకొంది. అదే జరిగితే చెరువు ఆయకట్టులో ఇప్పటికే సాగుచేసిన పశుగ్రాసానికి అవసరమైన నీటి తడులకు ఇబ్బందులు కలుగుతాయి. పలు గ్రామాలలో నీటి వనరులు కూడా అడుగంటిపోయే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులైనా స్పందించి భవనాసి చెరువులో నీటిని చేపల చెరువులకు పంపింగ్‌ చేయకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 21 , 2026 | 03:10 AM