Share News

భళా.. బసవన్నా..!

ABN , Publish Date - Oct 01 , 2026 | 01:46 AM

‘మెడ మీద కాడిపెట్టి.. చెర్నాకోల చేతపట్టి.. హొయ్‌ హొయ్‌ అని అదిలిస్తే.. రయ్‌ రయ్‌మంటూ పరుగెత్తే మేటి గిత్తను నేను’ అంటూ ఒంగోలు కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శన మునిసిపాలిటీ శతాబ్దిన్నర ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బుధవారం సాయంత్రం స్థానిక మినీ స్టేడియంలో ఒంగోలు జాతి గిత్తల అందాల ప్రదర్శన పోటీలు జరిగాయి.

భళా.. బసవన్నా..!
నగరంలో ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శన (ఇన్‌సెట్‌లో) అభివాదం చేస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల,

శతాబ్దిన్నర ఉత్సవాల సందర్భంగా ఒంగోలు జాతి గిత్తలతో భారీ ప్రదర్శన

ఎడ్లబండిలో ప్రయాణిస్తూ ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే దామచర్ల

పాల్గొన్న మంత్రి స్వామి, ఎంపీ మాగుంట, పలువురు ప్రజాప్రతినిధులు

భారీగా తరలివచ్చిన రైతులు

ఆసక్తిగా తిలకించిన నగర ప్రజలు

ఒంగోలు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ‘మెడ మీద కాడిపెట్టి.. చెర్నాకోల చేతపట్టి.. హొయ్‌ హొయ్‌ అని అదిలిస్తే.. రయ్‌ రయ్‌మంటూ పరుగెత్తే మేటి గిత్తను నేను’ అంటూ ఒంగోలు కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శన మునిసిపాలిటీ శతాబ్దిన్నర ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బుధవారం సాయంత్రం స్థానిక మినీ స్టేడియంలో ఒంగోలు జాతి గిత్తల అందాల ప్రదర్శన పోటీలు జరిగాయి. అనంతరం జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన దాదాపు 200 ఎడ్లతో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌రావు ఎడ్ల అందాల పోటీలు, ర్యాలీని ప్రారంభించారు. ఎడ్లబండిలో ఎక్కి దారిపొడవునా ప్రజలను ఉత్సాహపరిచారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ స్వామి, ఎంపీ మాగుంట, కలెక్టర్‌ రాజాబాబు, పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌ డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్య, ఒడా చైర్మన్‌ షేక్‌ రియాజ్‌, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ నెల్లూరు బస్టాండ్‌, ప్రకాశం భవన్‌, ట్రంక్‌రోడ్డు, పాత కూరగాయల మార్కెట్‌ మీదుగా అద్దంకి బస్టాండ్‌లోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు సాగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతన్నలు ఆకుపచ్చ కండువాలు మెడలో ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శనను చూసేందుకు నగర ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా రోడ్డుకు ఇరువైపులా ఇనుప బారికేడ్లు ఏర్పాటు చేశారు.

బహుమతుల ప్రదానం

ఒంగోలు జాతి గిత్తల అందాల పోటీలలో గెలుపొందిన యజమానులకు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్‌ పి.రాజాబాబు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి రూ.50 వేలు లింగారెడ్డి శ్రీకాంత్‌రెడ్డి ఎడ్లు, రెండో బహుమతి రూ.40 వేలు రాయపాటి విశ్వేశ్వరరావు గిత్తలు గెలుపొందాయి. వారికి చెక్కును, జ్ఞాపికలను బహూకరించారు.

Updated Date - Oct 01 , 2026 | 01:46 AM