కీలక దశకు చేరిన బెట్టింగ్‌ల దర్యాప్తు
ABN , Publish Date - Mar 24 , 2026 | 02:24 AM
క్రికెట్ బెట్టింగ్‌ల మూలాలను ఛేదిం చేందుకు పోలీసుల ప్రత్యేక బృందం ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. అనేక జిల్లాలకు చెందిన వ్యక్తులు బెట్టింగ్‌లలో కీలక పాత్ర పోషిస్తు న్నట్లు తెలుస్తోంది. దీంతో వివిధ కోణాల్లో లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
పలు జిల్లాలకు చెందిన వారి పాత్ర ఉన్నట్లు గుర్తింపు
నిందితులు, అనుమానితుల బ్యాంక్ లావాదేవీల పరిశీలన
పోలీసు ప్రత్యేక బృందం ముమ్మర విచారణ
దర్శి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): క్రికెట్ బెట్టింగ్‌ల మూలాలను ఛేదిం చేందుకు పోలీసుల ప్రత్యేక బృందం ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. అనేక జిల్లాలకు చెందిన వ్యక్తులు బెట్టింగ్‌లలో కీలక పాత్ర పోషిస్తు న్నట్లు తెలుస్తోంది. దీంతో వివిధ కోణాల్లో లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులు, నిందితుల బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. నర్సరావుపేట కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్‌ల వ్యవహారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లోని పలు జిల్లాలకు విస్తరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్, గుంటూరు, పిడుగురాళ్ల, కడప, ఆధోని, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 25 మంది బెట్టింగ్ సూత్రధారులను గుర్తించినట్లు సమాచారం.
వెలుగులోకి కీలక విషయాలు
కొద్దిరోజుల క్రితం నర్సరావుపేటలో ఒక కీలక నిందితుడితోపాటు దర్శిలో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన విషయం విదితమే. కోర్టు అనుమతితో పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకొని విచారించగా అనేక కీలక అంశాలు, బెట్టింగ్‌లలో సూత్రధారుల వివరాలు సేకరించినట్టు సమాచారం. వారందించిన సమాచారం ప్రకారం అనేక జిల్లాల్లో ప్రత్యేక బృందం సోదాలు నిర్వహిస్తోంది. బెట్టింగ్‌లకు పాల్పడిన వ్యక్తులు నగదును ఎవరికి బదిలీ చేశారనే విషయాన్ని బ్యాంకు లావాదేవీల ద్వారా పరిశీలిస్తున్నారు. ఆడబ్బులు ఎవరికి చేరాయనే విషయాన్ని క్రోడీకరించుకొని బెట్టింగ్‌ల నిర్వహణలో కీలక వ్యక్తులను పలువురిని గుర్తించినట్లు తెలుస్తోంది. వారు ఎంతోకాలంగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. అదేసందర్భంగా అనేక మంది విద్యార్థులు, యువత అమాయకంగా బెట్టింగ్‌లు పెట్టి డబ్బులు పోగొట్టుకున్నట్టు గుర్తించారు. యువతను ముగ్గులోకి దింపుతున్న ప్రధాన నిందితుల సమాచారం కూడా రాబట్టినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల్లో దర్యాప్తు పూర్తిస్థాయిలో కొలిక్కివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దర్శిలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారికి కౌన్సెలింగ్
దర్శి ప్రాంతంలో అనేకమంది యువకులు అమాయకంగా బెట్టింగ్‌లు పెట్టి డబ్బులు పోగొట్టుకున్నట్టు గుర్తించారు. దర్శి డీఎస్పీ బి.లక్ష్మీనారాయణ, సీఐ వై.రామారావు ఆధ్వర్యంలో పోలీసులు బెట్టింగ్‌లకు పాల్పడిన యువకులు, వారి తల్లిదండ్రులతో కౌన్సెలింగ్ నిర్వహించారు. తెలిసీతెలియక విద్యార్థులు బెట్టింగ్ సూత్రధారుల మాయలోపడి డబ్బులు పొగొట్టుకున్నందున భవిష్యత్తులో ఈ తప్పుచేయకుండా చూడాలని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎంతో విలువైన జీవితాలను పాడుచేసుకోవద్దని యువతకు వార్నింగ్ ఇచ్చారు.
బలమైన కేసులు పెట్టే అవకాశం
బెట్టింగుల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులపై బలమైన కేసులను పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎంతోమంది యువకులు బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా అనేక గ్రామాలకు చెందిన యువకులు లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. బెట్టింగ్‌లపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తుండటంతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాధితులు పోలీసుల వద్దకువచ్చి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశాలతో ప్రత్యేక బృందం ఈసారి క్రికెట్ బెట్టింగ్‌ల్లో మూలాల్లోకి వెళ్లి కీలక నిందితులను గుర్తించటంతో భవిష్యత్తులో ఈజాఢ్యానికి పూర్తిగా పుల్‌స్టాప్ పెడతారని ప్రజలు ఆశిస్తున్నారు.