Share News

రమణీయం.. చెన్నుడి రథోత్సవం

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:42 PM

పాహిమాం చెన్నకేశవ.. జైజై చెన్నకేశవ.. నమో చెన్నకేశవ.. మమ్మేలు ఇలవేల్పా.. శరణఘోషలతో మార్కాపురం పట్టణం హోరెత్తింది. శ్రీదేవిభూదేవి సమేతుడై చెన్నుడు రథంపై కొలువైన వేళ భక్తులు తన్మయత్వంతో మునిగిపోయారు. దేవదేవుని దివ్యమంగళ స్వరూపం తిలకించి భక్త జనం పులకించిపోయారు.

రమణీయం.. చెన్నుడి రథోత్సవం
స్వామికి నమస్కరిస్తున్న మంత్రి రవికుమార్‌, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు నారాయణరెడ్డి,జనార్దన్‌

ఇదివో ఇల వైకుంఠమిదే

చెన్నకేశవ నామ స్మరణలతో మారుమోగిన మార్కాపురం

భక్త జన సంద్రం.. వెల్లివెరిసిన ఆధ్యాత్మిక శోభ

మార్కాపురం వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి) : పాహిమాం చెన్నకేశవ.. జైజై చెన్నకేశవ.. నమో చెన్నకేశవ.. మమ్మేలు ఇలవేల్పా.. శరణఘోషలతో మార్కాపురం పట్టణం హోరెత్తింది. శ్రీదేవిభూదేవి సమేతుడై చెన్నుడు రథంపై కొలువైన వేళ భక్తులు తన్మయత్వంతో మునిగిపోయారు. దేవదేవుని దివ్యమంగళ స్వరూపం తిలకించి భక్త జనం పులకించిపోయారు.

రథోత్సవంలోనూ విజ్ఞానం

రథోత్సవంలోనూ అనంతమైన విజ్ఞానం దాగి ఉంది. ఎనిమిది చక్రాలతోనూ, నవ రంద్రాలతో నిర్మితమైన మన శరీరమే రథమని, దీనిని నడిపించే గుర్రాలే మన కోరికలని, గుర్రాలను అదుపు చేసే పగ్గం మనస్సు అని రథసారథి బుద్ధి అని, ఈ రథంపై స్వామిని కూర్చుండబెట్టుకొని నాలుగు మాఢవీధులు అనబడే నాలుగు సంధ్యల్లోనూ ధర్మోచితంగా నడవగలిగిన వారికి జన్మధన్యమని తెలిపేదే రథోత్సవ సందేశం.

మార్కాపురంలోని శ్రీలక్ష్మి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం రథోత్సవం రమణీయంగా సాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఇసకేస్తే రాలనంతగా పట్టణం కిక్కిరిసింది. రథంలో ఉభయ దేవేర్లతో స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని తిలకించిన భక్త జన కోటి పులకరించిపోయింది. విశేష సుగంధ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకృతులైన శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవుని ఉత్సవరులను తిలకించి భక్తులను పారవశ్యంలో మునిగిపోయారు. ముఖ్య అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు ఉత్సవరులను సువర్ణ రజిత మణిమయ భూషిత ఆభరణాలు, పట్టువస్ర్తాలతో శోభాయమానంగా అలంకరించి రథంపైకి చేర్చారు. అనంతరం విశ్వక్సేనఆరాధన, పుణ్యఃవాచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు బలిహరణ తరువాత రథం కింద గుమ్మడికాయలు పెట్టి, కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. తమలపాకులు రథంపై చల్లారు. జై చెన్నకేశవ గోవింద నామ స్మరణలతో రథాన్ని లాగారు. నాలుగు మాఢవీధులలో రథంపై విహరించిన చెన్నుడు తిరిగి ఆలయానికి చేరుకున్నాడు. చెన్నకేశవుని దర్శించుకునేందుకు భక్తులు మిద్దెలు, మేడలు బహుళ అంతస్తుల భవనాలు ఎక్కారు. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, కలెక్టర్‌ విజయసునీత, జేసీ శ్రీనివాసులు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మారిటైం బోర్డు చైర్మన్‌ సత్య, ఎమ్మెల్యేలు నారాయణరెడ్డి, జనార్దన్‌, ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, ఆర్డీవో ప్రభాకర్‌ పాల్గొనగా, బ్రహ్మోత్సవాల సేవా సంఘం నాయకులు కాశీవిశ్వనాథం, వక్కలగడ్డ మల్లికార్జునరావు, ఆలంపల్లి శ్రీనివాస్‌, వెంకటసుధీర్‌, తాళ్లపల్లి సత్యనారాయణ, చెక్కిలం వెంకటనారాయణరావులు పర్యవేక్షించారు. డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

గజవాహనంపై స్వామి

బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం గజవాహనంపై సార్వభౌమ అలంకారంలో చెన్నకేశవస్వామి విహరించారు. స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈవో గొలమారి శ్రీనివాసులరెడ్డి పర్యవేక్షించారు.

Updated Date - Apr 11 , 2026 | 11:42 PM