రమణీయం.. రథోత్సవం
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:26 PM
రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రంగా పొదిలి శ్రీపార్వతీ సమేత నిర్మమహేశ్వరస్వామి దేవాలయం ప్రసిద్ధి గాంచింది. ప్రాచీన కాలంనాటిదిగా, దక్షిణకాశీగా పేరొందింది.
వైభవంగా పొదిలిలో నిర్మమహేశ్వరుని ఊరేగింపు
శివనామస్మరణలతో మార్మోగిన పొదిలి పట్టణం
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
వీధివీధినా శీతలపానియాలు, అన్నదాన కార్యక్రమాలు
పొదిలి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రంగా పొదిలి శ్రీపార్వతీ సమేత నిర్మమహేశ్వరస్వామి దేవాలయం ప్రసిద్ధి గాంచింది. ప్రాచీన కాలంనాటిదిగా, దక్షిణకాశీగా పేరొందింది. అలాంటి దేవాలయంలో కొలువైన శివపార్వతీసమేత నిర్మమహేశ్వరస్వామి రథోత్సవం సోమవారం మధ్యాహ్నం 1.52 గంటలకు అశేష భక్తజనం నడుమ కనులపండువగా సాగింది. తొలుత ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు చేసి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. వేలాదిమంది భక్తులు వెంటరాగా రథంపై ఉత్సవమూర్తులను ఉంచారు. అనంతరం గుమ్మడికాయలతో దిష్టితీసి, వారుపోసి, కాయాకర్పూరం సమర్పించారు. హరహర మహదేవ.. శంభోశంకర నామస్మరణతో భక్తజనం రథాన్ని లాగగా యాత్ర ముందుకు సాగింది. స్వామిని గౌరీశంకరులుగా అలంకరించి అర్చక స్వాములు వేదమంత్రాలు చదువుతూ ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, పురుషులు ఎవరికి వారే పోటీపడి రథాన్ని లాగారు. చిన్నబస్టాండ్, పెద్ద బస్టాండ్, నిమ్మయ్య హోటల్, రాఘవేంద్ర సినిమాహాల్, దర్శిరోడ్డు మీదుగా రథోత్సవం సాగింది. ఆనవాయితీ ప్రకారం నిమ్మయ్య హోటల్ దగ్గరకు పురుషులు రథాన్ని లాగారు. అక్కడి నుంచి మహిళలకు అవకాశం కల్పించారు. సాయంత్రం 3.35 గంటలకు రథం శివాలయ ప్రాంగణానికి చేరింది. అనంతరం హారతి అందుకొని భక్తులు ప్రసాదం స్వీకరించారు. రథోత్సవంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, పోలీసులు, ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. తహసీల్దార్ కృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా, కనిగిరి డీఎస్పీ సాయిఈశ్వర్‌యశ్వంత్ తదితర అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు స్వామిని దర్శించుకున్నారు. రథ నిర్మాణ దాత సామంతపూడి నాగేశ్వరరావు, గోపురం నిర్మాణ దాత మాకినేని రమణయ్య, ఉభయదాతలను ఆలయ కమిటీ చైర్మన్ ఒగ్గు వెంకటరామయ్య, ఈవో నర్రా నారాయణరెడ్డి ఆలయ మర్యాదలతో ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.
అడుగడుగునా అన్నదానాలు
పార్వతీసమేత నిర్మమహేశ్వరస్వామి రథోత్సవం సందర్భంగా వచే ్చ భక్తుల కోసం అడుగడుగునా అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఎక్కడికక్కడ ఎవరికివారు స్వతాహాగా ఏర్పాటు చేశారు. పట్టణంలో మార్కాపురం అడ్డరోడ్డు నుంచి చిన్నబస్టాండ్ వరకు అన్నదానం, మజ్జిగ, మంచినీళ్లు, ఆరంజి జ్యూస్, పెరుగన్నం వంటివి భక్తులకు అందజేశారు.