Share News

జనసేనలోకి వచ్చి.. వైసీపీకి పనిచేస్తున్న బాలినేని

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:36 PM

వయస్సు పెరిగే కొద్ది ప్రెస్టేషన్‌ పెరుగుతున్నట్టుంది.. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరి వైసీపీకి కోవర్టుగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే జనార్దన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జనసేనలోకి వచ్చి.. వైసీపీకి పనిచేస్తున్న బాలినేని
గత ఐదేళ్లలో టీడీపీ శ్రేణులపై దాడికి వచ్చిన బాలినేని అనుచరుల ఫొటోలు చూపిస్తున్న జనార్దన్‌

అతని అవినీతిపై రాస్తే పుస్తకాలు కూడా సరిపోవు

టీడీపీ శ్రేణులపై గత ఐదేళ్లలో అక్రమంగా 79 కేసులు పెట్టించి ఇప్పుడు నీతివచనాలా!

నీ కొడుకు చేసిన సెటిల్‌మెంట్లు, దందాలు, గంజాయి ఘనకార్యాలు ఎవరూ మర్చిపోలేదు

వియ్యంకుడు విల్లాలో ప్రభుత్వ భూమిపై నోరు మెదపరేం?

మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డిపై ఎమ్మెల్యే జనార్దన్‌ ఫైర్‌

ఒంగోలు కార్పొరేషన్‌, ఆగస్టు9 (ఆంధ్రజ్యోతి) : వయస్సు పెరిగే కొద్ది ప్రెస్టేషన్‌ పెరుగుతున్నట్టుంది.. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరి వైసీపీకి కోవర్టుగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే జనార్దన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో ఆదివారం బాలినేని మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఎమ్మెల్యే దామచర్ల కూడా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ తనపై అవినీతి ఆరోపణలు చేయడం బాలినేనికి అలవాటుగా మారిందన్నారు. ఒంగోలు వచ్చినపుడల్లా తనను తలుచుకోకుంటే జనాలు పట్టించుకోరన్న భయంలో అతను ఉన్నాడని ఎద్దేవా చేశారు. బాలినేని అనుచరుడు బొమ్మినేని మురళీ తనపై లేనిపోని ఆరోపణలు చేసి, అబద్దాలు రాసి విజయవాడలో పోస్టుబాక్స్‌లో వేసినట్లు ఆధారాలు లభించాయన్నారు. అలాంటి వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటే బాలినేనిలో ఎందుకు భయం పుడుతుందో అర్థం కావడం లేదని విమర్శించారు. గత ఐదేళ్లలో బాలినేని చేసిన అవినీతి, అక్రమాలు పుస్తకాలు ముద్రిస్తే పేపర్లు కూడా సరిపోవన్నారు. ప్రజలు ఘోరంగా ఓడించినా ఇంకా నిస్సిగ్గుగా ప్రజలకు నేనున్నాంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. వైసీపీ హయాంలో టీడీపీ శ్రేణులపై అక్రమంగా 79 కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టినపుడు ఏమైంది ఈ నీతివచనాలు అని ప్రశ్నించారు. కొడుక్కి జనసేన పార్టీలో పదవి రాదనే ప్రెస్టేషన్‌లోఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మీ కొడుకు ఘన కార్యాలు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. యువతను గంజాయికి అలవాటు చేసి, దందాలు, సెటిల్‌మెంట్‌లు చేసిన సంగతిని బాలినేని మర్చిపోయినట్లున్నారని విమర్శించారు. నేడు పదవి లేకపోవడంతో నీతి వాక్యాలు చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఐదుసార్లు గెలవడం కాదు, ఎలా మాట్లాడుతున్నామో అని తెలుసుకోవాలని హితవుపలికారు. బాలినేని అవినీతి అక్రమాలపై వాస్తవాలు మాట్లాడేందుకుకాణిపాకంలోని దేవుడు దగ్గర ఒట్టు వేస్తాను, అలాగే నీకు కూడా ఒట్టు వేసే ధైర్యం ఉందా? అని బాలినేనిని ప్రశ్నించారు. వియ్యంకుడు విల్లాలో ప్రభుత్వ భూమి ఉంటే దానిని వెంగముక్కలపాలెం ప్రజలకు కమ్యూనిటీ హాలు కింద ఇస్తాం అని బాలినేని ప్రకటించాడు.. మరి ఆ సంగతేంటి అని? అని దామచర్ల ప్రశ్నించారు. ప్రజలకు జనార్దన్‌ అంటే ఏమిటో తెలుసు కాబట్టే ఒంగోలు చరిత్రలో లేని మెజారిటీ ఇచ్చారని, ఐదుసార్లు గెలిచి నువ్వు సాధించిన అవినీతి అక్రమాలకు తగిన గుణపాఠం చెప్పినా ఇంకా తీరు మార్చుకోకపోవడం సిగ్గు చేటు అన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. మీడియా సమావేశంలోపీడీసీసీ బాంకు చైర్మన్‌ డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైౖర్మన్‌ ఆర్‌. వెంకట్రావు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 11:36 PM