Share News

చిట్టాతో బాబు.. విందు పేరుతో లోకేష్‌

ABN , Publish Date - Feb 19 , 2026 | 02:32 AM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ల భేటీలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి పూర్తయ్యాయి. చంద్రబాబు అరడజనుకుపైగా సర్వే సంస్థలతో తెప్పించుకున్న నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలతో నిర్మొహమాటంగా సమీక్ష చేస్తుండగా.. మంత్రి నారా లోకేష్‌ ఉల్లాసంగా, ఉత్సాహంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

చిట్టాతో బాబు.. విందు పేరుతో లోకేష్‌

నేడు విద్యాశాఖ మంత్రి, రేపోమాపో సీఎం

ఉమ్మడి జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలతో భేటీలు

ఆ నలభై మందిలో జిల్లా నుంచి ఎవరు?

లిక్కర్‌ కింగ్‌లపై ప్రత్యేక దృష్టి

అరడజనుకుపైగా సర్వేలతో నివేదిక సిద్ధం

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ల భేటీలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి పూర్తయ్యాయి. చంద్రబాబు అరడజనుకుపైగా సర్వే సంస్థలతో తెప్పించుకున్న నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలతో నిర్మొహమాటంగా సమీక్ష చేస్తుండగా.. మంత్రి నారా లోకేష్‌ ఉల్లాసంగా, ఉత్సాహంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గురువారం ఒంగోలు, బాపట్ల లోక్‌సభల పరిధిలోని ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. సీఎం చంద్రబాబు అందుబాటులో లేనందున ఆయనతో జరగాల్సిన సమావేశాలు రెండు, మూడు రోజులు వాయిదా పడ్డాయి. అయితే లోకేష్‌ మాత్రం గురువారం సాయంత్రం ఈ రెండు లోక్‌ సభలలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన వద్ద లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల వారీ ఉన్న నివేదికలతో సమావేశాల్లో సమీక్ష చేస్తున్నారు. అందిన సమాచారం మేరకు ఇప్పటికే అరడజనుకుపైగా సంస్థలతో వేర్వేరుగా సమీక్షలు చేయించారు. ఆయా నియోజకవర్గాల వారీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు ఎలా ఉంది? వాటి విషయంలో సదరు ఎమ్మెల్యే పాత్ర ఎంత? అలాగే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా.. పార్టీశ్రేణులతో సమన్వయంతో నడుస్తున్నారా? వారిని గౌరవిస్తున్నారా? ఆదాయ వనరుల విషయంలో చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నారా? ఇత్యాధి అంశాలపై సర్వే జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య, మంత్రులు, నాయకులు, అధికారులు మధ్య, సమన్వయం ఎలా ఉందన్న విషయంపై కూడా సర్వే జరిగినట్లు సమాచారం. తద్వారా రూపొందించిన నివేదికలను దగ్గర బెట్టుకుని సీఎం మాట్లాడుతున్నారు. దీంతో చంద్రబాబునాయుడు సమీక్ష ఎలా ఉండబోతుందన్న ఆందోళన అందరిలోనూ ఆరంభమైంది.

ఆ నలభై మందిలో ఎవరు?

ఇటీవల చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని నలభై మంది ఎమ్మెల్యేలు అనేక విషయాల్లో వెనుకబడి ఉన్నారని.. పాలన, పార్టీ వ్యవహారాల్లో వారి వైపు నుంచి లోపాలు ఉన్నాయని స్పష్టం చేశారు. వారిని విడివిడిగా పిలిచి మాట్లాడతానని తెలిపారు. అయితే సమయాభావంతో కొందరితో విడివిడిగాను, మరికొందరితో జిల్లా సమీక్ష సమావేశాల సందర్భాల్లోనే మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఆ జాబితాలో ఉమ్మడి జిల్లాలో ఒకరిద్దరు ఉన్నారన్న ప్రచారం ఉన్నతస్థాయి నాయకుల్లో జరుగుతోంది. మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు చివరి స్థానాల్లో ఉన్నారని, వారిలో ఎవరైనా ఆ జాబితాలో ఉన్నరో లేదో ఈ సమీక్ష సమావేశాల్లో వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

ఆ ముగ్గురు ఎవరు?

మద్యం వ్యాపారులతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు కలిగిన ఎమ్మెల్యేలపై ప్రత్యేక సర్వే జరిగినట్లు తెలుస్తోంది. అందులో ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి సదరు వ్యాపారంతో ప్రత్యక్ష సంబంధం ఉందన్న సమాచారం ఆ సర్వేల్లో వెల్లడైనట్లు తెలిసింది. మద్యం, బియ్యం, ఇసుక, మట్టి, తదితర అంశాలపైనే ఒక సంస్థ ద్వారా ప్రత్యేకంగా సర్వే చేయించినట్లు సమాచారం. తదనుగుణంగా ఇసుక, రేషన్‌ బియ్యం తదితర అంశాలను పక్కనపెడితే మద్యం వ్యాపారంలో ప్రత్యక్ష సంబంధం ఎవరికి ఉందన్న విషయమై ప్రధానంగా దృష్టిపెట్టారు. అలా ముగ్గురికి ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. ఈ అంశం చంద్రబాబు దగ్గర జరిగే సమీక్షలో వస్తుందని భావిస్తున్నారు.

నేడు లోకేష్‌తో విందు భేటీ

మంత్రి లోకేష్‌ ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులతో వినూత్నంగా విందు భేటీ నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం లోకేష్‌తో భేటీకి కుటుంబసభ్యులతో హాజరుకావాలని ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు రవికుమార్‌, స్వామి, ఎంపీలు మాగుంట, కృష్ణప్రసాద్‌, మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. అందుబాటులో ఉన్న కుటుంబ సభ్యులతో సాయంత్రం ఏడు గంటలకు జరిగే సమావేశానికి నేతలంతా సిద్ధమయ్యారు. నేతల కుటుంబసభ్యుల భేటీ సమయంలో లోకేష్‌ మహిళలకు మంగళగిరి చీరలు బహూకరిస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఏమిటి? వాటి స్థితి ఏమిటి? అంటూ నివేదిక అందించి ప్రధానంగా ప్రజా, పార్టీశ్రేణులతో సంబంధాలు కొనసాగించడంలో ఎమ్మెల్యేల పాత్రపై సూచనలు చేసి పంపుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Feb 19 , 2026 | 02:32 AM