కలెక్టర్‌కు అవార్డు
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:17 PM
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో భాగంగా అత్యుత్తమ ఎన్నికల మ్యాపింగ్ ప్రక్రియను జిల్లాలో సమర్థంగా అమలు చేసినందుకు కలెక్టర్ పీ రాజాబాబు రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు.
ఎన్నికల మ్యాపింగ్ ప్రక్రియను సమర్థంగా అమలు చేసినందుకు గుర్తింపు
ప్రకాశం జిల్లాకు రాష్ట్ర స్థాయి అవార్డు
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో భాగంగా అత్యుత్తమ ఎన్నికల మ్యాపింగ్ ప్రక్రియను జిల్లాలో సమర్థంగా అమలు చేసినందుకు కలెక్టర్ పీ రాజాబాబు రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జరిగిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్, రాష్ట్ర ఎన్నికల రిటైర్డ్ అధికారి నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌లతోపా టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌లు కలెక్టర్ రాజాబాబుకు ఆ అవార్డును ప్రదానం చేశారు. ఉత్తమ ఎన్నికల నిర్వహణతో పాటు సర్ ప్రక్రియలో అత్యుత్తమ ఎన్నికల మ్యాపింగ్‌ను విజయవంతంగా అమలు చేయడం ద్వారా జిల్లాకు రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల యంత్రాంగం సమన్వయ కృషి ఫలితంగానే అవార్డు వచ్చిందని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరింత సమర్థవంతంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల ఈఆర్వోలు వెంకట శివరామిరెడ్డి, కే మాధూరి, ఏ కుమార్, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు అవార్డులు అందుకున్నారు.