టెన్త్ పరీక్షలకు ఆటోమేషన్
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:46 AM
పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఈ ఏడాది విద్యాశాఖ పలు సంస్కరణలను ప్రవేశపెట్టింది. పరీక్షల అధికారులు, ఇన్విజిలేటర్ల నియామకాన్ని డిజిటల్ విధానంలో ఆటోమేషన్ పద్ధతిలో కంప్యూటర్ ద్వారా చేపట్టడానికి శ్రీకారం చుట్టింది.
చీఫ్, డీవో, ఏడీవోల నియామక ఉత్తర్వులు విడుదల
కొందరికి సుదూరంగా విధులు.. ఇంకొందరికి మినహాయింపు
ఒంగోలు విద్య, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఈ ఏడాది విద్యాశాఖ పలు సంస్కరణలను ప్రవేశపెట్టింది. పరీక్షల అధికారులు, ఇన్విజిలేటర్ల నియామకాన్ని డిజిటల్ విధానంలో ఆటోమేషన్ పద్ధతిలో కంప్యూటర్ ద్వారా చేపట్టడానికి శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో తొలి అడుగుపడింది. ఉమ్మడి జిల్లాలోని 165 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు, అదనపు డిపార్టుమెంట్ అధికారులను నియమించారు. ఛీప్, డీవో, ఏడీవోలుగా నియమి తులైన హైస్కూలు హెడ్మాస్టర్లు, సీనియర్ స్కూలు అసిస్టెంట్లకు నియామకపు ఉత్తర్వులను బుధవారం వారి మెయిల్‌కు పంపారు. వీరు మెయిల్ నుంచి ఉత్తర్వులను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఒక్కో కేంద్రానికి ఒక్కొక్కరు చొప్పున చీఫ్, డీవోలు, విద్యార్థులు ఎక్కువసంఖ్యలో ఉన్న కేంద్రాలకు అదనపు డిపార్టుమెంట్ అధికారులను నియమించారు. చీఫ్, డీవో, ఏడీవోలుగా నియమితులైన వారి జాబితాను బుధవారం డీఈవో కార్యాలయానికి పంపారు. విధుల నుంచి ఎవ రికీ మినహాయింపు ఇచ్చేది లేదని ముందుగానే ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ప్రక టించిన నేపఽథ్యంలో ఏమైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే సర్దుబాటు చేసు కునేందుకు మండలానికి ఇద్దరు చొప్పున రిజర్వులో ఉంచారు. తాము పనిచే స్తున్న పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాయని కేంద్రాలకు వీరిని నియమిం చారు. కొందరికి అదేమండలంలో, మరికొందరిని పొరుగు మండలాల్లో నియమించారు. ఆటోమేషన్ విధానంలో నియామకాల వల్ల కొందరు హెచ్‌ఎంలు, స్కూలు అసిస్టెంట్లను దూరప్రాంతాల్లో నియమించడంతో వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. పొదిలి మండలం ఉప్పలపాడు హైస్కూలులో పనిచేస్తున్న వారిని ఏకంగా 100 కిలోమీటర్లు దూరంలోని గిద్దలూరులో నియమించడంతో వారు ఆందోళన చెందుతున్నారు. అయితే జాబితాల్లో మార్పులకు చేర్పులకు డీఈవోకు అధికారం ఇచ్చారు. దీంతో దూరప్రాంతాల్లో నియమితులైన వారు డీఈవోను కలిసేందుకు సిద్ధమవుతున్నారు.
వీరికి డ్యూటీ నుంచి మినహాయింపులు
టెన్త్ పరీక్షల నిర్వహణకు అధికారులు, సిబ్బంది నియామకంలో మొదట ఏడు మినహాయిపులు ఇచ్చారు. ఆ తర్వాత మరో 15 ఇచ్చారు. ఈ మినహాయింపులు ఇచ్చేముందే 60 ఏళ్ల వయస్సు దాటిన వారిని పరీక్షల విధులకు నియమించడం లేదని కమిషనరు ప్రకటించారు. చంటి పిలల్లలకు పాలు ఇస్తున్న తల్లులు, గతంలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన వారిని, ప్రైవేటుగా ట్యూషన్లు నిర్వహిస్తున్న వారిని, 10వతరగతికి హాజరవుతున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులను, సస్పెన్షన్‌లో ఉన్న వారిని, గర్భిణీలను, క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో ఉన్నవారిని పరీక్షల విధులకు దూరంగా ఉంచమన్నారు. క్యాన్సర్‌కు చికిత్సపొందుతున్న వారు, ఓపెన్ హార్ట్ సర్జరీ, స్టంట్, అవయవ మార్పిడి, మేజర్ న్యూరోసర్జరీ చేయించుకున్న వారు, టీబీ ఉన్నవారు, కిడ్నీ మార్పిడి, వెన్నెముక సర్జరీ చేయించుకున్నవారు, పిల్లలు, స్పౌజ్ మానసిక వైకల్యానికి చికిత్స పొందుతుంటే, జువెనల్ డయాబెటిస్‌తో బాధపడుతున్న పిల్లలు ఉన్నవారిని, హీమోపీలియోతో బాధపడుతున్న పిల్లలు ఉన్న వారిని 75శాతం వైకల్యం, అంగవైకల్యం గలవారిని, 70 నుంచి 90 శాతం వినికిడిలోపం ఉన్నవారిని పరీక్షల విధుల నుంచి మినహాయించనున్నారు. ఆన్‌లైన్‌లో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టిన్)లోని ఉపాధ్యాయులు వివరాలు, లీప్‌యాప్‌లోని వివరాలు ఆధారంగా ఛీఫ్, డీవో, ఏడీవోలను నియమించారు. వీరిలో ఎవరైనా మినహాయింపు పరిధిలోకి వచ్చేవారిని పొరపాటున డ్యూటీకి నియమిస్తే వారు తగు ఆధారాలతో డీఈవోను కలిసి పరీక్షల విధుల నుంచి మినహాయింపు పొందవచ్చు.