Share News

కె.రాజుపాలెం సర్పంచ్‌ పదవికి వేలం

ABN , Publish Date - Nov 18 , 2026 | 02:32 AM

మండలంలోని కె. రాజుపాలెం సర్పంచ్‌ పదవికి సోమవారం రాత్రి గ్రామస్థులందరూ సమిష్టిగా వేలం పాట నిర్వహించారు. సర్పంచ్‌ పదవిని టీడీపీకి చెందిన గొట్టిపాటి శ్రీహరి అనే యువకుడు రూ.35 లక్షలకు వేలం పాట పాడారు. ఈ నిధులను గ్రామాభివృద్ధికి వినియోగిస్తామని పెద్దలు తెలిపారు.

కె.రాజుపాలెం సర్పంచ్‌ పదవికి వేలం
కె. రాజుపాలెంలో నిర్వహించిన వేలం పాటలో పాల్గొన్న గ్రామస్థులు

రూ.35 లక్షలకు దక్కించుకున్న గొట్టిపాటి శ్రీహరి

బల్లికురవ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కె. రాజుపాలెం సర్పంచ్‌ పదవికి సోమవారం రాత్రి గ్రామస్థులందరూ సమిష్టిగా వేలం పాట నిర్వహించారు. సర్పంచ్‌ పదవిని టీడీపీకి చెందిన గొట్టిపాటి శ్రీహరి అనే యువకుడు రూ.35 లక్షలకు వేలం పాట పాడారు. ఈ నిధులను గ్రామాభివృద్ధికి వినియోగిస్తామని పెద్దలు తెలిపారు. కె.రాజుపాలెం గ్రామంలో గతంలో సర్పంచ్‌ ఎన్నికలు అంటే తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఉండేవి. 2021లో సం‘గ్రామం’ సందర్భంగా గ్రామస్థులందరూ పార్టీలకతీతంగా ఒక చోటకు చేరి ఎన్నికలు మనకొద్దు, మన మధ్య గొడవలు వద్దు అంటూ వేలం పాట పెట్టారు. అప్పట్లో రూ.14 లక్షలకు అమరనేని లక్ష్మి సర్పంచ్‌ పదవిని దక్కించుకొన్నారు. అప్పటినుంచి గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇప్పుడు మరలా పంచాయతీ ఎన్నికలు రావడంతో గతంలో మాదిరిగానే ఏకగ్రీవమయ్యేలా గ్రామస్థులు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి గ్రామంలోని ప్రధాన మండపం వద్ద సర్పంచ్‌ పదవికి వేలం పాట నిర్వహించగా గొట్టిపాటి శ్రీహరి దక్కించుకున్నారు. శ్రీహరి హైదరాబాద్‌లో వ్యాపారాలు చేస్తూ గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నారు. సర్పంచ్‌గా ఎన్నికై గ్రామంలో మరింత అభివృద్ధి పనులు చేయాలని అయన నిర్ణయించుకున్నారు. దీంతో పెద్దలు నిర్వహించిన వేలం పాటలో రూ. 35 లక్షలకు పదవిని దక్కించుకొన్నారు. అదే గ్రామానికి చెందిన ఏలూరి రంగారావు రూ.34.50 లక్షల వరకు పాట పాడారు.

తురకపాలెంలోనూ..

తాళ్లూరు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : తాళ్లూరు మండలం తురకపాలెం దశాబ్దాలపాటు ఫ్యాక్షన్‌ గొడవలతో అట్టుడికిపోయింది. 30 ఏళ్లుగా గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొన్నప్పటికీ ఎన్నికల సమయంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు పోటాపోటీగా ఉంటూ స్వల్ప ఘర్షణలు జరుగుతూ ఉద్రిక్తత పరిస్థితులు ఉండేవి. ఆగ్రామం పోలీస్‌ రికార్డుల్లో ఇప్పటికీ హైపర్‌సెన్సిటివ్‌ గ్రామంగా ఉంది. గత సర్పంచ్‌ ఎన్నికల్లో కూడా ఇరువర్గాలు పోటీపడ్డాయి. ఈపర్యాయం గ్రామస్థులు ఐకమత్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. గ్రామంలో శివాలయం నిర్మాణానికి ముందుకు వచ్చిన వారిని సర్పంచ్‌గా ఏకగ్రీవం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలోని ఇరుపార్టీలకు చెందిన పెద్దలు కూర్చుని మాట్లాడుకోగా టీడీపీ మద్దతుదారుడు కుమ్మిత సుబ్బారెడ్డి ముందుకు వచ్చి శివాలయం నిర్మాణానికి రూ.50లక్షలు, గుడికి అనువైన రూ.20లక్షల విలువైన స్థలాన్ని ఉచితంగా అందజేస్తానని ముందుకు వచ్చినట్టు సమాచారం. ఇరువర్గాలకు చెందిన ప్రజలు ఆమోదం తెలిపినట్లు సమాచారం. జనరల్‌ మహిళకు కేటాయించడంతో సుబ్బారెడ్డి సతీమణి కె.రమణమ్మ గ్రామ ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికవడం ఇకలాంఛనమే. కూటమి ప్రభుత్వం ఏకగ్రీవాలకు ప్రోత్సాహకం ఇస్తున్నందున కూటమి మద్దతుదారుడు తురకపాలెం గ్రామానికి ఏకగ్రీవ సర్పంచ్‌ కానున్నారు.

---------------------------------

Updated Date - Nov 18 , 2026 | 02:32 AM