Share News

బాలసదన్‌లో దారుణం

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:05 AM

బాలసదన్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ అనాఽథ బాలిక సకాలంలో చికిత్స అందక కన్నుమూసినట్లు చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ తేల్చింది. ఈ ఘటన నగరంలోని రాంనగర్‌లో స్త్రీశిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలసదనంలో చోటుచేసుకుంది.

బాలసదన్‌లో దారుణం
బాలిక మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు

సకాలంలో చికిత్స అందక బాలిక మృతి

అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న వాదన

ఒంగోలునగరం, జనవరి 24 (ఆంరఽధజ్యోతి): బాలసదన్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ అనాఽథ బాలిక సకాలంలో చికిత్స అందక కన్నుమూసినట్లు చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ తేల్చింది. ఈ ఘటన నగరంలోని రాంనగర్‌లో స్త్రీశిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలసదనంలో చోటుచేసుకుంది. రిమ్స్‌ వైద్యశాలలో చికిత్సపొందుతూ శనివారం వేకువజామున కుంచాల మౌనిక(13)మృతిచెందింది. స్థానిక బాలాజీనగర్‌లో నివాసముంటున్న బాలిక తల్లిదండ్రులు మృతిచెందటంతో అనాథగా మారిన మౌనికను స్థానికులు బాలసదనంలో చేర్చారు. ఆమెను మూడు నెలల క్రితం బాలసదన్‌ అధికారులు బాపట్ల జిల్లా చినగంజాం కేజీబీవీలో చేర్చారు. అక్కడ బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావటంతో పాఠశాల సిబ్బంది స్థానిక ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం ఇచ్చి ఒంగోలు పంపించారు. సంక్రాంతి సెలవులకు ముందు బాలిక ఒంగోలు బాలసదన్‌కు తెచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను అప్పుడే ఆసుపత్రిలో చేర్చాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తీరా ఈనెల 19వ తేదీన బాలిక ఆరోగ్యం పూర్తిగా క్షీణించటంతో రిమ్స్‌ ఆసుపత్రిలో చేర్చారు. బాలిక చికిత్స పొందుతూ 24వతేదీ వేకువజామున మృతిచెందింది. బాలికను మృతిపై చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ వేము రామాంజనేయుడు ప్రాథమిక విచారణ చేపట్టారు. బాలికకు ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించిపోతున్నా బాలసదనమ్‌ సిబ్బంది కాని, జిల్లా బాలల సంరక్షణ కమిటీ విభాగం కాని సకాలంలో స్పందించలేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె ఆరోగ్యపరిస్థితి విషమించిన సమయంలో చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన తెలిపారు. కాగా ఆయన శనివారం రిమ్స్‌కు వెళ్లి సూపరింటెండెంట్‌, ఇతరవైద్యులతో మాట్లాడారు. బాలిక పరిస్థితి పూర్తిగా విషమించిన తర్వాతే ఆసుపత్రికి తీసుకువచ్చారని వైద్యులు ఆయనకు తెలియజేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి నివేదిక పంపుతానని తెలిపారు.

Updated Date - Jan 25 , 2026 | 03:05 AM