Share News

రైతు బిడ్డగా కష్టాలు తీరుస్తున్న సీఎం

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:47 AM

రైతు బిడ్డగా సీఎం చంద్రబాబు రైతుల కష్టాలను తీరుస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు.

రైతు బిడ్డగా కష్టాలు తీరుస్తున్న సీఎం
మాట్లాడుతున్నమంత్రి స్వామి

మంత్రి శ్రీబాలవీరాంజనేయస్వామి

పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని వినతి

హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు

నర్సింగోలు(కొండపి), అక్టోబరు9 (ఆంధ్రజ్యోతి) : రైతు బిడ్డగా సీఎం చంద్రబాబు రైతుల కష్టాలను తీరుస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. శుక్రవారం జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ‘మీ భూమి - మీ హక్కు’ గ్రామ సభలో సీఎం ముఖ్యఅతిఽథిగా పాల్గొన్న సభలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఒకే రోజు 3,304 ఎకరాలకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం పరిష్కరించారన్నారు. ప్రధానంగా దశాబ్దాలుగా రైతులు ఇబ్బందులు పడుతున్న గర్భ కండ్రిగ భూముల సమస్యలను సీఎం పరిష్కరించినందుకు నియోజకవర్గ ప్రజల తరఫున స్వామి సీఎం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో ప్రజా ప్రభుత్వం వచ్చాక రాజముద్రతో 39 వేల మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేశామన్నారు. గొడ్డలి పార్టీ రైతుల పాస్‌ పుస్తకాలపై, సరిహద్దు రాళ్లపై జగన్‌ బొమ్మలు వేసుకుందని విమర్శించారు. గడచిన ఐదేళ్లలో సంగమేశ్వరం ప్రాజెక్ట్‌ పనులను మూలకు నెట్టిన గొడ్డలి పార్టీ, ప్రాజెక్ట్‌ పనులను చేపట్టలేదని సొంత పత్రిక సాక్షిలో తప్పుడు రాతలు రాస్తోందని విమర్శించారు. నల్లమల సాగర్‌ ద్వారా మార్కాపురం, ప్రకాశం జిల్లాలకు నీరిచ్చి వాటర్‌ మ్యాన్‌గా సీఎం చంద్రబాబు పేరుగాంచారన్నారు. రానున్న రోజుల్లో కొండపి నియోజకవర్గంలోని పాలేరుకు వెలిగొండ ఫేజ్‌-2 ద్వారా నీరిచ్చి వెనుకబడిన ప్రాంతాలను ఆదుకుంటోందని చెప్పారు. ఒంగోలు మేజర్‌ కెనాల్‌ ద్వారా ముసికి 0.6 టీఎంసీల నీటిని కేటాయించి, ఎలుగోరిపాలెం వద్ద 50 లక్షల రూపాయలతో ఎస్కేప్‌ పనులను ప్రజా ప్రభుత్వం పూర్తి చేసిందని మంత్రి స్వామి చెప్పారు. దామచర్ల కుటుంబం, పార్టీ అండదండలతో మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యానని మంత్రి స్వామి పేర్కొన్నారు.


పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని వినతి... నియోజకవర్గంలో సీఎం చంద్రబాబునాయుడి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక రూ.750 కోట్లతో అభివృద్ధి, రూ.800 కోట్లు సంక్షేమానికి నిధులు ఖర్చు చేశామని మంత్రి వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి, పలు మండలాల్లో రైతులకు మేలు జరిగేందుకు వివిధ పనులకు నిధులు మంజూరు చేయాలని సీఎంకు స్వామి విజ్ఞప్తి చేశారు. వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు ముసి, పాలేరు, ఇతర వాగుల మీద తీర మండలాల వారికి ఉపయోగపడే విధంగా ముసిపై చెక్‌డ్యాంలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్‌ రోడ్లు అభివృద్ధికి రూ.40 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణానికి రూ.50 కోట్లు నిధులివ్వాలని మంత్రి స్వామి విజ్ఞప్తి చేశారు.

సీఎం హామీ... అనంతరం సీఎం ప్రసంగంలో స్వామి అడిగిన సమస్యలను తీరుస్తానని, అడిగిన శాఖలకు నిధులు మంజూరు చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు హామీఇచ్చారు. తాగునీటి సమస్య నియోజకవర్గంలో లేకుండా ఇంటింటికి తాగునీరిచ్చే కార్యక్రమం కూడా పూర్తి చేస్తానని సీఎం హామీనిచ్చారు.

Updated Date - Oct 10 , 2026 | 12:47 AM