భార్య, అత్తను హత్య చేసిన నిందితుల అరెస్ట్
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:56 PM
సంతమాగులూరు మండలం ఏల్చూరులో అర్ధరాత్రి సమయంలో భార్య, అత్తను కిరాతకంగా గొంతులు కోసి హత్య చేసిన అన్నదమ్ములు మీసరగండు వసంతకుమార్, అనిల్ కుమార్‌లను బుధవారం సంతమాగులూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
సంతమాగులూరు(అద్దంకి), సెప్టెంబరు30(ఆంధ్రజ్యోతి) : సంతమాగులూరు మండలం ఏల్చూరులో అర్ధరాత్రి సమయంలో భార్య, అత్తను కిరాతకంగా గొంతులు కోసి హత్య చేసిన అన్నదమ్ములు మీసరగండు వసంతకుమార్, అనిల్ కుమార్‌లను బుధవారం సంతమాగులూరు పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శి డీఎ్‌సపీ బాలమురళీకృష్ణ బుధవారం సంతమాగులూరు సర్కిల్ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏల్చూరుకు చెందిన మీసరగండు వసంతకుమార్‌కు 13 ఏళ్ల క్రితం మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతలకు చెందిన వీరనారాయణమ్మతో వివాహమైంది. 12 ఏళ్ల కుమారుడు, 8 నెలల పాప ఉన్నారు. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై వసంతకుమార్‌కు అనుమానం ఉండి తరచూ గొడవ పడుతున్నాడు. గొడవలు సర్దిచెప్పటానికి తల్లి బ్రహ్మేశ్వరమ్మ ఏల్చూరులోని కుమార్తె ఇంటికి వచ్చింది. గత నెల 25న అర్ధరాత్రి బ్రహ్మేశ్వరమ్మ, వీరనారాయణమ్మలు ఉండగా అన్నదమ్ములు వసంతకుమార్, అనిల్‌కుమార్‌లు ఇంట్లోకి వచ్చి తలుపులు వేశారు. తల్లీకూతుళ్లు చిలకపాటి బ్రహ్మేశ్వరమ్మ(52), వీరనారాయణమ్మ(29)లను కూరగాయలు కోసే కత్తితో గొంతులు కోశారు. బ్రహ్మేశ్వరమ్మ కిటికీలో నుంచి తప్పించుకొని రోడ్డు మీదకు వెళ్లగా అనిల్‌కుమార్ అక్కడకు వెళ్లి గొంతు కోయటంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న సంతమాగులూరు సీఐ శేషగిరిరావు సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించగా బ్రహ్మేశ్వరమ్మ అప్పటికే మృతి చెంది ఉంది. వీరనారాయణమ్మ చేతి వేలు కదలటాన్ని గమనించి కొన ఊపిరితో ఉన్నట్లు గుర్తించి 108 వాహనంలో నర్సరావుపేట వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ 26వ తేదీ మృతి చెందింది. బ్రహ్మేశ్వరమ్మ భర్త వీరనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం పుట్టావారిపాలెం అడ్డరోడ్డు వద్ద అన్నదమ్ములు వసంతకుమార్, అనిల్‌కుమార్‌లను సంతమాగులూరు సీఐ శేషగిరిరావు ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసును వెంటనే ఛేదించి నిందితులను పట్టుకున్న సీఐ శేషగిరిరావును డీఎస్పీ బాలమురళీకృష్ణ అభినందించారు. ఇద్దరిని కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.