భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:27 AM
శివరాత్రి పండుగ సందర్భంగా నిర్మమహేశ్వరాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలనికనిగిరి డీఎస్పీ సాయిఈశ్వర్‌యశ్వంత్ చెప్పారు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వాహనాలతో రావద్దు
రథోత్సవానికి సుమారు 30వేల మంది భక్తులు వస్తారని అంచనా
పొదిలి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : శివరాత్రి పండుగ సందర్భంగా నిర్మమహేశ్వరాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలనికనిగిరి డీఎస్పీ సాయిఈశ్వర్‌యశ్వంత్ చెప్పారు. శుక్రవారం స్థానిక పార్వతీసమేత నిర్మమహేశ్వరాలయాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజులు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాశివరాత్రి పండుగ సందర్భంగా దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారన్నారు. అంచనాకు తగినట్లు ఏర్పాట్లు చేయాలని చైర్మన్ ఒగ్గు వెంకట్రామయ్య, ఈవో నర్రా నారాయణరెడ్డికి సూచించారు. వీఐిపీ దర్శనాలు తగ్గించి క్యూలైన్‌లలో భక్తులకు త్వరగా స్వామి దర్శనం కల్పించాలన్నారు. క్యూలో ఉన్న భక్తులకు అవసరమైన తాగునీటి వసతి కల్పించాలని చెప్పారు. అదేవిధంగా రథోత్సవం సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 30వేల మంది భక్తులు వస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రథోత్సవం రోజున ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందుగా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని సంబంధిత అధికారులకు తెలిపారు. రథోత్సవం రోజున భక్తులు ద్విచక్రవాహనాలు, కార్లు, వరిగడ్డి, కర్ర ట్రాక్టర్లు వంటి తెచ్చి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వాటిని రోడ్లపైకి తీసుకురావద్దని సూచించారు. 80 నుంచి 100మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. భక్తులకు ఏ సమస్య వచ్చినా వెంటనే సంబంధిత పోలీసులకు, ఆలయ అధికారులకు తెలియజేయాలని చెప్పారు. సీఐ రాజే్‌షకుమార్, ఎస్‌ఐ రాజేష్ పాల్గొన్నారు.