Share News

పరిషత్‌ పోరుకు ఏర్పాట్లు

ABN , Publish Date - Sep 10 , 2026 | 03:15 AM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను చేపట్టాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఆ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు.

పరిషత్‌ పోరుకు ఏర్పాట్లు

రేపటి లోపు ఓటర్ల జాబితాలు

ఉమ్మడి జిల్లాలో 56 జడ్పీటీసీ, 742 ఎంపీటీసీ స్థానాలు

20,85,374 మంది ఓటర్లు.. 2,637 పోలింగ్‌ కేంద్రాలు

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 9 (ఆంధ్ర జ్యోతి): ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను చేపట్టాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఆ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈనెల 11వతేదీ లోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురించనున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 56 జడ్పీటీసీ, 742 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటి పరిధిలో 20,85,374 మంది ఓటర్లు ఉండగా అందులో 10,40,779 మంది పురుషులు, 10,44,519 మంది మహిళలు, ఇతరులు 76మంది ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాల పునర్విభజనలో కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసింది. నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు, బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చింది. ఈనేపథ్యంలో కొత్త జిల్లాల ప్రాతిపదికన కొత్త జడ్పీల ఏర్పాటుకు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న ప్రకాశం, మార్కాపురం జిల్లాల వారీగా ఎంపీటీసీలు, జడ్పీటీసీల ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో 28 మండలాలు, మార్కాపురం జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. ఆ విధంగా ఓటర్ల జాబితాలు, పోలింగ్‌ కేంద్రాలు విభజన చేసే ప్రక్రియను ఆ శాఖ అధికారులు చేపట్టారు.

Updated Date - Sep 10 , 2026 | 03:15 AM