Share News

గృహ గణనకు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:23 AM

వచ్చే ఏడాది జరగనున్న భారత జన గణనలో భాగంగా గృహ గణనకు జిల్లాలో ఏర్పాట్లు చక చకా జరుగుతున్నాయి. కేంద్రప్రభుత్వ ఆదేశా లతో ఈసారి సమగ్రంగా గృహగణన నిర్వహిం చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

గృహ గణనకు ఏర్పాట్లు పూర్తి

16 నుంచి 30 వరకు సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌

మే 1 నుంచి ఇంటింటి గణన

ఒంగోలు కలెక్టరేట్‌. మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : వచ్చే ఏడాది జరగనున్న భారత జన గణనలో భాగంగా గృహ గణనకు జిల్లాలో ఏర్పాట్లు చక చకా జరుగుతున్నాయి. కేంద్రప్రభుత్వ ఆదేశా లతో ఈసారి సమగ్రంగా గృహగణన నిర్వహిం చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్‌ రాజాబాబు నేతృత్వంలో జిల్లావ్యాప్తంగా ఈ ఇప్పటికే శిక్షణ కూడా ముగించారు. మే 1వతేదీ నుంచి 30వతేదీ వరకు గృహ గణన చేపట్టాల్సి ఉండటంతో అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌(వ్యక్తిగతంగా) ఏప్రిల్‌ 16 నుంచి 30వతేదీ వరకు తమ సెల్‌ఫోన్‌ ద్వారా వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. ఎవరికి వారే సెల్‌ఫోన్‌ ద్వారా తమ వివరాలన్నింటినీ పొందుపర్చితే ఒక ఐడీ నెంబర్‌ వస్తుంది. తమ గృహానికి వచ్చే ఎన్యుమరేటర్‌కు ఆ ఐడీ నెంబర్‌ చెబితే సరిపోతుంది. ఒకవేళ వ్యక్తిగతంగా వివరాలు నమోదు చేసుకోలేకపోతే నివాసాల వద్దకు వచ్చినప్పుడు ఎన్యుమరేటర్‌కు సంబంధిత అంశాలన్నింటినీ చెప్పాల్సి ఉంటుంది. ఇంటింటి గణన చేసే సమయంలో ఎన్యుమరేటర్‌ 34 అంశాలను ఆ కుటుంబం నుంచి సేకరిస్తారు. ఎన్యుమరేషన్‌కు సంబంధించి ఇప్పటికే జిల్లాస్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. అందులో శిక్షణ పొందిన వారు మండలస్థాయిలో ఎన్యుమరేటర్లకు ఈనెల 12 నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామస్థాయిలో ఎన్యుమరేషన్‌ చేసేందుకు స్వర్ణ పంచాయతీ, పట్టణాల్లో స్వర్ణ వార్డు ఉద్యోగులను ఎంపిక చేశారు. ఈ శిక్షణ కార్యక్రమం ముగిసిన అనంతరం మండల స్థాయిలో తహసీల్దార్‌ సూపర్‌వైజర్‌గా, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ రాజాబాబు ప్రిన్సిపల్‌ సెన్సెస్‌ అధికారిగా మొత్తం కార్యక్రమానికి వ్యవహరించనున్నారు.

ప్రజల నుంచి సేకరించే సమాచారం ఇలా ఉంది.

గృహంలో నివశించే సభ్యుల సంఖ్య, వారి పేర్లు, లింగం, కుటుంబ యజమాని వివరాలు

కుటుంబ యజమానిది షెడ్యూల్‌ కులమా, షెడ్యూల్‌ తెగా లేదా ఇతర తరగతులకు చెందిన వారా.. అన్న సమాచారాన్ని సేకరిస్తారు.

ఇంటిలో గదుల సంఖ్య, వివాహమైన జంటల సంఖ్య

ఇంటిలో సదుపాయాలు, ఆస్తులు, ఆదాయవనరుల వివరాలు

రేడియో/టెలివిజన్‌/ఇంటర్నెట్‌ సౌకర్యం/ల్యాప్‌టాప్‌/కంప్యూటర్‌/స్మార్ట్‌ఫోన్‌/సైకిల్‌/స్కూటర్‌/ మోటార్‌సైకిల్‌/మోపెడ్‌/కారు/జీపు/వ్యాను ఇతర వస్తువుల వివరాలను సేకరిస్తారు

జనగణన ప్రక్రియకు సంబంధించి సంప్రదించడానికి ఇంటి యజమాని ఫోన్‌ నెంబరును తీసుకుంటారు. ఇలా కేంద్రప్రభుత్వం నిర్దేశించిన 34 అంశాలతో ముద్రించిన ప్రశ్నపత్రాలతో ఎన్యుమరేటర్లు గృహ గణనలో సమాచారాన్ని సేకరిస్తారు.

Updated Date - Apr 01 , 2026 | 01:23 AM