ఏరియా హాస్పిటల్ సెక్యూరిటీ బలవన్మరణం
ABN , Publish Date - Feb 24 , 2026 | 11:04 PM
చీరాల ఏరియా హాస్పిటల్లో ప్రయివేట్ సెక్యూరిటీగా పనిచేస్తున్న వ్యక్తి బలవన్మరణం చెందాడు.
మృతిపై విచారణ చేపట్టిన పోలీసులు
పుల్లాయిపాలెం(చీరాల), ఫిబ్రవరి24 (ఆంధ్రజ్యోతి) : చీరాల ఏరియా హాస్పిటల్లో ప్రయివేట్ సెక్యూరిటీగా పనిచేస్తున్న వ్యక్తి బలవన్మరణం చెందాడు. అందిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని పుల్లాయిపాలేనికి చెందిన నక్కల దేవప్రకాష్(25) సుమారు ఏడు మాసాలుగా చీరాల ఏరియా వైద్యశాల సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. ఇతని అన్న విజయరాజు ఓ ప్రయివేట్ కంపెనీలో పనిచేస్తుండగా, తల్లిదండ్రులు శ్రీనివాసరావు, రమణమ్మ రైతు కుటుంబీకులు. ఎప్పటిలాగే మంగళవారం ప్రకాష్ విధులకు హాజరయ్యాడు. మధ్యాహ్నం భోజనానికి వెళ్లి వస్తానని చెప్పి అరగంటలోనే సాల్మన్ సెంటర్ సమీపంలోని రైలు పట్టాలపై గుర్తుతెలియని రైలు ఢీకొని బలవన్మరణం చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్దకు చేరుకుని బోరున విలపించారు. ఘటనకు కొద్ది నిమిషాల ముందు మిత్రులకు ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్న విషయం చెప్పినట్లు సమాచారం.