Share News

దొంగ పట్టాలు పుట్టించి అమ్మి మాపై నిందలా?

ABN , Publish Date - Feb 23 , 2026 | 10:40 PM

ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడు సర్వే నెంబర్‌ 186లో ఉన్న స్థలాలకు దొంగ పట్టాలు పుట్టించి అమాయకులకు లక్షల రూపాయలకు అమ్మి ఇప్పుడు టీడీపీపై నిందలు వేస్తే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ నేతలు హెచ్చరించారు.

దొంగ పట్టాలు పుట్టించి అమ్మి మాపై నిందలా?
మాట్లాడుతున్న శ్రీనివాసరావు, పక్కన మదన్‌, నాగేశ్వరరావు తదితరులు

అసలైన కబ్జాదారులు వైసీపీకి చెందినవారే

ఆ స్థలాలపై సిట్‌ విచారణ ఉన్నది వాస్తవం కాదా..

టీడీపీపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలి

మీడియా సమావేశంలో టీడీపీ నాయకుల వెల్లడి

ఒంగోలు కార్పొరేషన్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడు సర్వే నెంబర్‌ 186లో ఉన్న స్థలాలకు దొంగ పట్టాలు పుట్టించి అమాయకులకు లక్షల రూపాయలకు అమ్మి ఇప్పుడు టీడీపీపై నిందలు వేస్తే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ నేతలు హెచ్చరించారు. సోమవారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ కామేపల్లిశ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్‌ మాట్లాడుతూ గతంలో పంచాయతీ పరిధిలో అప్పటి ప్రభుత్వం వేసిన లే అవుట్‌లో కొంతమంది వ్యక్తులు ప్లాట్లు కొనుగోలు చేశారన్నారు. వారిపేరు మీద రిజిస్ట్రేషన్‌లు కూడా జరిగాయని చెప్పారు. ఆ భూమికి విలువ పెరగడంతో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలు దానిని కబ్జా చేశారన్నారు. దొంగ పట్టాలు పుట్టించి, అమాయక ప్రజలకు కట్టబెట్టి లక్షలు దోచుకున్నవారే నేడు తెలుగుదేశంపై నిందలు మోపుతున్నారని విమర్శించారు. అమాయక ప్రజలకు దొంగపట్టాలు ఇచ్చినట్లు కేసులు కూడా నమోదై, సిట్‌ విచారణలో ఉందన్నారు. తెలుగుదేశం పార్టీపై బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలని చెప్పారు. వైసీపీ నేతలు తాము చేసిన తప్పిదాలను టీడీపీ వారిపై నెట్టి ఆక్రమణదారులుగా మాట్లాడటం సరికాదన్నారు. తెలియక దొంగ పట్టాలు కొని ఇప్పటికే ఆ ప్రాంతంలో రేకుల షెడ్డు వేసుకుని జీవిస్తున్న వారిలో అర్హులైన వారికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పట్టాలు ఇవ్వడానికి కూడా హామీ ఇచ్చారని చెప్పారు. అసలైన భూ హక్కుదారుల ఒరిజినల్‌ భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 23 , 2026 | 10:40 PM