Share News

‘యాప్‌’సోపాలు

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:49 PM

ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు తావు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.. అందులో భాగంగా ఇప్పటికే పలుమార్పులు తీసుకొచ్చి 100 రోజుల నుంచి 125 రోజుల పనిదినాలను పెంచాయి.. ఈ ఏడాది మార్చి నెలలో పనిదినాలు ప్రారంభం నుంచి శ్రామికుల ముఖహాజరు విధానం తప్పనిసరి చేస్తూ అమల్లోకి తీసుకొచ్చింది.

‘యాప్‌’సోపాలు
ఎర్రగొండపాలెంలో ముఖ హాజరు వేస్తున్న అధికారులు, ముఖ హాజరులో శ్రామికులు

ముఖహాజరు తప్పనిసరితో ఉపాధి కూలీలు, సిబ్బందికి అవస్థలు

కేవలం 20 శాతమే హాజరు 90 శాతం ఈకేవైసీ పూర్తి

ఏప్రిల్‌ మొదటి వారానికి సమస్య ఉండదంటున్న అధికారులు

ఎర్రగొండపాలెం రూరల్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు తావు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.. అందులో భాగంగా ఇప్పటికే పలుమార్పులు తీసుకొచ్చి 100 రోజుల నుంచి 125 రోజుల పనిదినాలను పెంచాయి.. ఈ ఏడాది మార్చి నెలలో పనిదినాలు ప్రారంభం నుంచి శ్రామికుల ముఖహాజరు విధానం తప్పనిసరి చేస్తూ అమల్లోకి తీసుకొచ్చింది. పనికి వచ్చిన వారికి, చేసిన పనికి తగిన వేతనం అందుతుందని అధికారులు చెప్తున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో మొత్తం 74,115 జాబ్‌ కార్డులు ఉండగా సుమారు 1,41,430 మంది శ్రామికులు యాక్టివ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

గత ఏడాది ఈ సమయానికి పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమై 100 శాతం పనులు జరిగాయి. ఈ ఏడాది నేటికీ 20 నుంచి 30 శాతం కూడా పనులకు శ్రామికులు హాజరు కాలేదు.

90శాతం ఈకేవైసీ

నియోజకవర్గ పరిఽధిలో శ్రామికులకు 90 శాతం ఈకేవైసీ పూర్తి అయినట్లు అధికారులు చెప్తున్నారు. 10 శాతం ఇతర ప్రాంతాల్లో ఉండడం వలన ఈకేవైసీ కాలేదని చెప్తున్నారు. ఇతర ప్రాంతాలలో ఉన్న శ్రామికులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ఉపాధి హామీ పథకం(వికసిత్‌ భారత్‌ జీ రామ్‌ జీ) అధికారులు కోరుతున్నారు.

పనిచేయని యాప్‌తో తలనొప్పి

ఎన్‌ఎంఎంఎ్‌స(నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌) యాప్‌లో ప్రతి శ్రామికుని ముఖహాజరు తప్పనిసరిగా నమోదు చేయాలి. పనికి వచ్చిన శ్రామికుల ముఖ హాజరు తీసుకోకపోవడం, యాప్‌ సరిగా పని చేయకపోవడంతో శ్రామికులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. గత శనివారం ఎర్రగొండపాలెంలో సుమారు 620 మంది పని ప్రదేశాలకు వచ్చి పని చేస్తుంటే కేవలం 70 మంది ముఖ హాజరే తీసుకుంది. మిగిలిన మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. నియోజకవర్గం మారుమూల ప్రాంతం కావడం, సరైన సిగ్నల్‌ ఉండని ప్రాంతాలు ఉండడంతో సమస్య మరింత తీవ్రంగా ఉంది. దీంతో సిబ్బంది పనిపెట్టాలన్నా, పెట్టిన పనికి శ్రామికులు రావాలన్నా రాలేకపోతున్నారు. ముఖహాజరు పెట్టిన యాప్‌(సా్‌ఫ్టవేర్‌) సక్రమంగా పని చేస్తే పని చేసేందుకు వీలుగా ఉంటుందని, పనులు చేసినా హాజరు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ హాజరు యాప్‌(సా్‌ఫ్టవేర్‌) మార్పులు చేసి సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని శ్రామికులు కోరుతున్నారు.


నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో జాబ్‌ కార్డులు, శ్రామికుల వివరాలు ఇవి

మండలం జాబ్‌ కార్డ్‌ శ్రామికులు

ఎర్రగొండపాలెం 17,642 33,654

త్రిపురాంతకం 16,402 32,379

పుల్లలచెరువు 15,163 28,870

పెద్దారవీడు 12,557 24,986

పెద్ద దోర్నాల 12,351 21,541,

ఏప్రిల్‌ మొదటి వారానికి సమస్యలు ఉండవు

నిర్మలాదేవి, ఏపీడీ, మార్కాపురం

యాప్‌ నూతన విధానం కావడంతో ముఖ హాజరు ఒక్కొక్కరికి తీసుకోవడం వలన కొంత ఆలస్యమవుతుంది. అంతేగాక యాప్‌ మార్పులు చేర్పులు చేయడం వలన కొంత నిదానంగా ఉంటుంది. ఏప్రిల్‌ మొదటి వారానికి మొత్తం సెట్‌ అవుతుంది. టెక్నికల్‌, ఫిల్డ్‌ అసిస్టెంట్లు పని ప్రదేశాలకు వెళ్లి శ్రామికులతో మాట్లాడి వారికి అవగాహన కల్పించాలని ఇప్పటికే ఆదేశించాం.

Updated Date - Mar 24 , 2026 | 11:49 PM