Share News

నిధుల గోల్‌మాల్‌పై చర్యలేవీ?

ABN , Publish Date - Feb 10 , 2026 | 02:49 AM

స్వయం సహాయక సంఘాల సభ్యుల సొమ్ము పెట్టుబడిగా పెట్టిన మహిళా మార్ట్‌లో నిఽధుల గోల్‌మాల్‌పై ఏళ్లు గడుస్తున్నా చర్యలు కరువయ్యాయి. అద్దంకి మునిసిపాలిటీ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో ఏడు వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యుల చేత బలవంతంగా సుమారు రూ.10.50 లక్షలు పెట్టుబడి పెట్టించి జగనన్న మహిళా మార్ట్‌ను ఏర్పాటు చేశారు.

నిధుల గోల్‌మాల్‌పై చర్యలేవీ?
అద్దంకిలోని మహిళా మార్ట్‌ (ఫైల్‌)

జగనన్న మహిళా మార్ట్‌ అవకతవకలపై విచారణ పూర్తి

మూలధనం చెల్లించిన పొదుపు మహిళల ఎదురుచూపులు

అద్దంకి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : స్వయం సహాయక సంఘాల సభ్యుల సొమ్ము పెట్టుబడిగా పెట్టిన మహిళా మార్ట్‌లో నిఽధుల గోల్‌మాల్‌పై ఏళ్లు గడుస్తున్నా చర్యలు కరువయ్యాయి. అద్దంకి మునిసిపాలిటీ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో ఏడు వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యుల చేత బలవంతంగా సుమారు రూ.10.50 లక్షలు పెట్టుబడి పెట్టించి జగనన్న మహిళా మార్ట్‌ను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ కాలనీలో గతంలో అన్న క్యాంటీన్‌ నిర్వహించిన భవనంలో వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత 2022 ఫిబ్రవరి 3న ఈ మార్ట్‌ను ప్రారంభించారు. ఆరంభం నుంచే అనేక ఆరోపణలు ఉన్నాయి. బాధ్యులైన వారు ఇష్టారీతిన నిధులను స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా మార్ట్‌లో నిధుల గోల్‌మాల్‌పై విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు స్వయం సహాయక సంఘాల సభ్యులు ఫిర్యాదు చేశారు. వెంటనే విచారణకు ఆదేశించడంతో తొలుత ఒకింత హడావుడి చేసిన అధికారులు, ఆ తర్వాత సాగదీయడం ప్రారంభించారు. అన్న క్యాంటీన్‌ పునఃప్రారంభం కావడంతో మార్ట్‌ను మూసివేశారు. అయితే, సభ్యులు పెట్టుబడి పెట్టే సమయంలో ఏటా లాభాలు పంచుతామని చెప్పారు. మహిళా మార్ట్‌ మూసివేసి ఏడాదిన్నర కావస్తున్నా ఇంతవరకు నయా పైసా సభ్యులకు చెల్లించలేదు. ఇంతకాలం సాగిన విచారణలో మహిళా మార్ట్‌లో గోల్‌మాల్‌కు సంబంధించి మొత్తం తొమ్మిది మందిని బాధ్యులుగా తేల్చినట్లు సమాచారం.

అంతా స్వాహా చేశారు

రెండున్నరేళ్లపాటు నిర్వహించిన మహిళామార్ట్‌లో సుమారు రూ.1.18 కోట్ల వ్యాపారం నిర్వహించారు. ఇందుకు సంబంధించి సుమారు రూ.30 లక్షల మేర ఆదాయం వచ్చినట్లు అంచనా. అందులో సిబ్బంది జీతాలకు రూ.15లక్షల ఖర్చయినా మరో రూ.15 లక్షల ఆదాయం మిగలాల్సి ఉంటుందని స్వయం సహాయక సంఘాల సభ్యుల అభిప్రాయం. మార్ట్‌ మూసివేసే సమయంలో పెట్టుబడి నిధి బ్యాంక్‌ ఖాతాలో రూ.10 వేల నగదు నిల్వ ఉండగా, మహిళా మార్ట్‌లో సుమారు రూ.40వేల సరుకులు ఉన్నాయి. అవకతవకలు బయట పడటంతో ఉన్న సరుకును అమ్మినట్లు చూపి రూ.5లక్షలు జమచేయడం విశేషం. ఇక లాభాలలో మరో రూ.3లక్షలు వచ్చినట్లు లెక్కలు చూపినట్లు తెలుస్తోంది. మార్టుపై జిల్లా మెప్మా అధికారులు పలుసార్లు విచారణ చేపట్టి నిధులు గోల్‌మాల్‌ అయినట్లు గుర్తించారు.

చర్యలపై మీనమేషాలు

నిధులు గోల్‌మాల్‌కు సంబంధించి అప్పట్లో మహిళా మార్ట్‌ నిర్వహణ బాధ్యతలు చూసిన మొత్తం తొమ్మిది మంది ప్రమేయం ఉండి ఉంటుందన్న అభిప్రాయాన్ని సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నరపాటు విచారణ సాగటం, మెప్మా రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదిక చేరినప్పటికి బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడంతో సభ్యుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవటంతోపాటు పెట్టుబడి నిధిని సభ్యులకు వెంటనే పంపిణీ చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Feb 10 , 2026 | 02:49 AM