మరో వేసవి
ABN , Publish Date - Aug 12 , 2026 | 02:02 AM
మరోసారి వేసవి వాతావరణం నెలకొంది. జిల్లావ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలో 40 డిగ్రీలకు చేరువలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆపై వేడిగాలులు కూడా వీస్తున్నాయి. నాలుగైదు రోజులుగా ఈ పరిస్థితి మరింత ఎక్కువైంది.
వర్షాలు కురవాల్సిన వేళ మండుతున్న ఎండలు
పలుచోట్ల 40 డి గ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
ఆపై వేడిగాలులు, విలవిల్లాడుతున్న జనం
పెరిగిన విద్యుత్ వినియోగం
ఒంగోలు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : మరోసారి వేసవి వాతావరణం నెలకొంది. జిల్లావ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలో 40 డిగ్రీలకు చేరువలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆపై వేడిగాలులు కూడా వీస్తున్నాయి. నాలుగైదు రోజులుగా ఈ పరిస్థితి మరింత ఎక్కువైంది. దీంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎండల వేడి నుంచి తట్టుకోలేక ఏసీలు, కూలర్లను వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వాడకం భారీగా పెరిగింది. ఉమ్మడి జిల్లాలో సాధారణంగా ఈ సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వేసవి ఎండల తీవ్రత పూర్తిగాపోయి ఒక మోస్తరు జల్లులు పడుతూ గ్రామాల్లో పచ్చని పైర్లు కనిపిస్తుండటంతోపాటు జోరుగా పొలం పనులు జరుగుతుంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎండలు దంచికొడుతున్నాయి. ఒక రకంగా వేసవిని తలపించే రీతిలో తీవ్రత ఉంటోంది. చాలా ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచే మండిపోతుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు తీవ్రత కొనసాగుతోంది. అందులో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల మధ్య అయితే ఇంచుమించు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద వుతున్నాయి. దీనికితోడు వేడిగాలులు వీస్తూ మండు వేసవిని తలపిస్తోంది. ఒంగోలు నగరంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం సమయంలో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే వేసవిని మించి నెలకొన్న వాతావరణ పరిస్థితి కనిపించింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో త్రోవగుంటలో జిల్లాలోనే అత్యధికంగా 39.71 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అది ఒంగోలులో 39.55గా ఉంది. జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు వేడిగాలులు కూడా వీస్తున్నాయి. ఎండల తీవ్రతతో విద్యుత్ వాడకం అధికమైంది. సాధారణంగా రోజువారీ జిల్లాలో వినియోగించే విద్యుత్‌లో మూడో వంతు మేర పెరిగినట్లు సమాచారం.