మరో వేసవి
ABN , Publish Date - Jul 14 , 2026 | 03:17 AM
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరోసారి వేసవి వాతావరణం నెలకొంది. మళ్లీ ఎండలు మండి పోతున్నాయి. వేడిగాలులు, ఉక్కపోత అధికంగా ఉండ టంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవు తున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మండుతున్న ఎండలు
పలుచోట్ల 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలోనే అత్యధికంగా చిలకపాడులో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
వేడిగాలులు, ఉక్కపోతతో జనం విలవిల
మరికొన్ని రోజులు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరోసారి వేసవి వాతావరణం నెలకొంది. మళ్లీ ఎండలు మండి పోతున్నాయి. వేడిగాలులు, ఉక్కపోత అధికంగా ఉండ టంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవు తున్నారు. మధ్యాహ్నం వరకు ఒక మోస్తరుగా ఎండ, సాయంత్రా నికి జల్లులు పడుతూ ఆహ్లాదకరంగా ఉండాల్సిన ఈ సమయంలో ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. అత్యధిక ప్రాంతాల్లో ఏకంగా 40 డిగ్రీలకు చేరువలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుం డటం ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
ఒంగోలు, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో సాధారణంగా ఏప్రిల్, మేలలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. జూన్ ఆరంభం నుంచి తొలకరి జల్లులు ప్రారంభమవుతాయి. ఆనెల రెండోపక్షం నుంచి వాతావారణం పూర్తిగా మారుతుంది. జూలై వచ్చేసరికి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. తరచూ జల్లులు పడుతూ ఉంటాయి. ఖరీఫ్ సీజన్ పంటల సాగు ఊపందుకుంటుంది. అయితే ఈ ఏడాది పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. జూలై తొలి పక్షం ముగుస్తున్నా సరైన వాన లేదు. ఆ మాటకు వస్తే అత్యధిక ప్రాంతాల్లో జల్లులు కూడా కనిపించడం లేదు. జూన్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో 40.23శాతం లోటు వర్షపాతం ఉంది. ఈ 40రోజుల్లో జిల్లాలో 75.34 మి.మీ వర్షపాతం కురవాల్సి ఉండగా 45.03 మి.మీ మాత్రమే పడింది. గరిష్ఠంగా చీమకుర్తి మండలంలో 86శాతం వర్షపాతం లోటు ఉండగా, అది దొనకొండలో ఏకంగా 92శాతంగా ఉంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలోని సంతనూతలపాడు మండలం చిలకపాడులో ఏకంగా 40డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఒంగోలు అర్బన్‌లో 39.80డిగ్రీలు, చీమకుర్తిలో 39.74, సంతనూతలపాడులో 39.67, రావినూతలలో 39.59డిగ్రీలు, మొగిలిచర్లలో 39.40, కరేడులో 39.34, ఉలవపాడులో 39.30. ఉప్పుగుండూరులో 39.29, పల్లామల్లిలో 39.20, శంకరాపురంలో 39.30, నలదలపూరులో 39.20 డిగ్రీల ఎండ కాచింది. మార్కాపురం జిల్లాలోని పామూరు మండలంలో 39.70 డిగ్రీలు గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కేకేమిట్ల మండలం అశ్వరాయనిపాలెంలో 39.29, పిటికాయగుళ్లలో 39.25, సానికవరంలో 39.40, కంభాలపాడులో 39.20, మేడపిలో 39.09 డిగ్రీలుగా ఉంది.
మార్కాపురంలో భారీ లోటు
మార్కాపురం జిల్లాలో ఇప్పటివరకు 34.98శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ఆ జిల్లా లో 83.67 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా 54.40 మి.మీ నమోదైంది. దోర్నాల మండలంలో 60.52శాతం లోటు ఉండగా.. అది త్రిపురాంతకంలో 62.80శాతం, వైపాలెంలో 60.40శాతం, బీపేటలో 58.70శాతంగా ఉంది. ఇలా వర్షం లేకపోవడమే కాక నాలుగైదు రోజులుగా రెండు జిల్లాల్లోనూ ఎండల తీవ్రత పెరిగింది. సోమవారం అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రజానీకం ఉక్కిరిబిక్కిరి..
రెండు జిల్లాల్లోనూ చాలాప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలో 39 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలా మధ్యాహ్న సమయంలోనే కాక ఉదయం 9 గంటల నుంచే ఎండల తీవ్రత ఆరంభమై సాయంత్రం ఆరు గంటల వరకూ కొనసాగుతోంది. ఎండలకు వేడిగాలులు, ఉక్కపోత తోడై ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు మరో వారం పది రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.