ఎస్‌ఎంసీ ఎన్నికల్లో మరో అడుగు
ABN , Publish Date - Sep 19 , 2026 | 03:14 AM
ప్రభుత్వ, ప్రభుత్వరంగ పాఠశాలల్లో యాజమాన్య కమిటీల (ఎస్‌ఎంసీ) ఎన్నికలకు సంబం ధించి మరో ముందడుగు పడింది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులైన తల్లిదండ్రులు/సంరక్షకుల జాబితాలను శుక్రవారం ప్రకటించారు.
పాఠశాలల్లో ఓటర్ల జాబితాలు ప్రకటన
పారదర్శకంగా నిర్వహణకు సిద్ధం
ఒంగోలు విద్య, సెప్టెంబరు 18(ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వ, ప్రభుత్వరంగ పాఠశాలల్లో యాజమాన్య కమిటీల (ఎస్‌ఎంసీ) ఎన్నికలకు సంబం ధించి మరో ముందడుగు పడింది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులైన తల్లిదండ్రులు/సంరక్షకుల జాబితాలను శుక్రవారం ప్రకటించారు. 1 నుంచి 12వ తరగతి వరకూ ప్రతి తరగతిలో నమోదైన విద్యార్థుల దరఖాస్తుల్లో పేర్కొన్న పేర్లతో జాబితాలను తయారు చేశారు. వాటిని తరగతుల వారీగా నోటీసు బోర్డుల్లో ఉంచారు. ఒక ఫ్యామిలీ పిల్లలు పాఠశాలలో రెండు లేక అంతకంటే ఎక్కువ తరగతుల్లో చదువుతుంటే ప్రతి తరగతి ఓటరు జాబితాల్లో వారి పేర్లను చేర్చారు. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 25లోపు తెలియజేయవచ్చు. అలా వచ్చిన వాటిని పరిశీలించి హెచ్‌ఎంలు పరిష్కరిస్తారు. పాఠశాలల్లో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు హెచ్‌ఎంలు చర్యలు తీసుకున్నారు. నిర్ణీత సభ్యుల కంటే ఎక్కువ మంది ఆసక్తి చూపి ఎన్నిక ఏకగ్రీవం కాకపోతే చేతులెత్తే పద్ధతిలో సభ్యులను ఎన్నుకోవాలి. అది వీలులేనప్పుడు ఓటర్ల అభిప్రాయాల మేరకు ఎక్కువ మంది ఎవరి పేరు చేబితే వారిని సభ్యులుగా ఎంపిక చేస్తారు. ఈ రెండు పద్ధతుల్లో ఎన్నికల నిర్వహణకు ఏకాభిప్రాయం కుదరకపోతే రహస్య బ్యాలెట్ ద్వారా మెజార్టీ సాధించిన వారిని సభ్యులుగా ఎంపిక చేయాలి.