విద్యాశాఖ విభజనలో మరో అడుగు
ABN , Publish Date - Sep 17 , 2026 | 02:50 AM
రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగుల విభజనకు సంబంధించి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఉద్యోగులను పునర్‌వర్గీకరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉద్యోగులు, అధికారులు జిల్లా, జోనల్, రాష్ట్ర.. ఇలా మూడు క్యాడర్‌లలో పనిచేస్తున్నారు.
ఉద్యోగులను వర్గీకరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు
ఒంగోలు విద్య, సెప్టెంబరు 16 (ఆంధ్ర జ్యోతి) : రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగుల విభజనకు సంబంధించి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఉద్యోగులను పునర్‌వర్గీకరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉద్యోగులు, అధికారులు జిల్లా, జోనల్, రాష్ట్ర.. ఇలా మూడు క్యాడర్‌లలో పనిచేస్తున్నారు. తాజాగా పునర్‌వర్గీకరణలో నాలుగు క్యాడర్లుగా లోకల్ జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర క్యాడర్లుగా వర్గీకరించారు. జిల్లాస్థాయి పోస్టులకు డీఈవో, జోనల్ స్థాయిపోస్టులకు ఆర్‌జేడీ, మల్టీజోన్ పోస్టులకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, రాష్ట్ర క్యాడర్ పోస్టులకు ప్రభుత్వం నియమించిన అధికారి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. ప్రస్తుత వర్గీకరణలో కొన్నిపోస్టుల స్థాయిని పెంచి, కొన్నింటి స్థాయిని కుదించారు. ఇప్పటివరకు సీనియర్ ఆఫీసు అసిస్టెంట్ జిల్లా స్థాయి పోస్టు కాగా తాజా వర్గీకరణలో దానిని జోనల్ పోస్టుగా మార్చారు. ఉపవిద్యాధికారి ఇప్పటివరకు జోనల్ పోస్టు కాగా ప్రస్తుతం దానిని మల్టీ జోన్ పోస్టుగా అప్‌గ్రేడ్ చేశారు. రాష్ట్రస్థాయి పోస్టులుగా ఉన్న జిల్లా విద్యాశాఖాధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులను స్థాయి తగ్గించి మల్టీ జోన్ పోస్టులుగా గుర్తించారు. తాజా వర్గీకరణలో 18రకాల పోస్టులను జిల్లా క్యాడర్ పోస్టులుగా, 11 రకాల పోస్టులను జోనల్ క్యాడర్‌గా, ఆరు రకాల పోస్టులను మల్టీ జోనల్ క్యాడర్‌గా వర్గీకరించారు. ప్రత్యక్ష నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు 95శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది.
కొన్ని పోస్టులను మర్చిపోయారు
తాజా వర్గీకరణలో కొన్ని పోస్టుల ఊసే లేకుండా పోయింది. జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో పనిచేస్తున్న లెక్చరర్లను జోనల్ క్యాడర్‌గా, సీనియర్ లెక్చరర్లను మల్టీ జోనల్ క్యాడర్ పోస్టులుగా గుర్తించిన ప్రభుత్వం డైట్ ప్రిన్సిపాల్స్‌ను మర్చిపోయింది. పాఠశాల విద్యాశాఖలో సింహభాగంగా ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూలు అసిస్టెంట్లు, గ్రేడ్-2 హెడ్మాస్టర్లు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు, పీడీ గ్రేడ్-2, భాషాపండితులు, పీఈటీలను వర్గీకరణలో విస్మరించారు. ప్రస్తుతం సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూలు అసిస్టెంట్లు జిల్లా స్థాయి లోకల్ క్యాడర్ పోస్టులు కాగా గ్రేడ్-2 హెచ్‌ఎంలు జోనల్ క్యాడర్ పోస్టులుగా గుర్తించారు. వీరిలో ప్రభుత్వ హైస్కూళ్ల హెచ్‌ఎంలను పాత మూడు జిల్లాల జోన్ పరిధిలో బదిలీలు, నియామకాలు జరుగుతుండగా జడ్పీ హైస్కూళ్ల హెచ్‌ఎంలను ఏ జిల్లా వారిని ఆ జిల్లాలోనే నియమిస్తున్నారు. వీరి వర్గీకరణ ఎప్పుడు జరుగుతుందో వేచిచూడాలి.