మరో ముందడుగు
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:00 AM
రామాయపట్నం పోర్టుకు సంబంధించి మరో అడుగు పడింది. పోర్టుకు అనుబంధంగా రూ.1,615 కోట్ల వ్యయ అంచనాతో కార్గో రైలు టెర్మినల్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది భవిష్యత్తులో దక్షిణాదిలో పోర్టు నుంచి సరుకు రవాణాలో అత్యంత కీలకం కానుందన్న అంచనాలను బలపరుస్తోంది.
రైలు కార్గో టెర్మినల్ కోసం మరో 450 ఎకరాల భూసేకరణ
రామాయపట్నం పోర్టుకు సమీపంలో నిర్మాణం
రూ.1,615 కోట్ల వ్యయ అంచనా
మోచర్ల, తెట్టు వద్ద ఏర్పాటు
వందలాది మందికి ఉపాధి
రామాయపట్నం పోర్టుకు సంబంధించి మరో అడుగు పడింది. పోర్టుకు అనుబంధంగా రూ.1,615 కోట్ల వ్యయ అంచనాతో కార్గో రైలు టెర్మినల్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది భవిష్యత్తులో దక్షిణాదిలో పోర్టు నుంచి సరుకు రవాణాలో అత్యంత కీలకం కానుందన్న అంచనాలను బలపరుస్తోంది. రమారమి 450 ఎకరాల విస్తీర్ణంలో చేవూరు, మోచర్ల మధ్య కార్గో టెర్మినల్ ఏర్పాటు కానుంది. తెట్టు, మోచర్ల గ్రామాల పరిధిలో రామాయపట్నం వరకు ఇది విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కందుకూరు, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): రామాయ పట్నం పోర్టుకు సంబంధించి మరో ప్రాజెక్టు మంజూరు కాబోతోంది. ఇటు రోడ్డుకు, అటు రైల్వేలైన్‌కు అనుసంధానంగా కార్గో టెర్మినల్ నిర్మించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే పోర్టు నిర్మాణం గుడ్లూరు మండలం సాలిపేట పంచాయతీ పరిధిలోని కర్లపాలెం, ఆవులవారిపాలెం, మొండివారిపాలెం గ్రామాల పరిధిలో జరుగుతున్న విషయం విదితమే. పోర్టుకు జాతీయ రహదారిని అనుసంధానించేందుకు గుడ్లూరు మండలం చేవూరు మీదుగా నాలుగు లైన్ల రహదారి నిర్మాణం కూడా జరిగింది. అయితే చేవూరు, రావూరు గ్రామాల పరిధిలోని భూములను పూర్తిగా బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కారిడార్‌కు కేటాయించగా భూసేకరణ ప్రక్రియ కూడా వేగవంతమైంది. బీపీసీఎల్ పరిధిలోకి ఎవరినీ అనుమతించే అవకాశం ఉండదు కనుక ఇప్పటికే చేవూరు-రావూరు గ్రామాలకు అనుసం ధానంగా ఉన్న బీటీ రోడ్డును బీపీసీఎల్‌కు మార్కెట్ విలువకు కేటాయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. అలాగే పోర్టుకు జాతీయ రహదారిని అనుసంధానిస్తూ నిర్మించిన రోడ్డును కూడా బీపీసీఎల్ స్వాధీనం చేసుకునే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నా యంగా చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిలో మోచర్ల వద్ద నుంచి రామాయపట్నం పోర్టుకు మరో మార్గం నిర్మాణం కోసం ఇటీవల ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది.
శరవేగంగా పనులు
ఇప్పటికే తెట్టు రైల్వేస్టేషన్ నుంచి రామాయపట్నం పోర్టుకు రైలుమార్గం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తొలుత సింగిల్ లైను నిర్మించాలని నిర్ణయించినప్పటికీ దానిని డబుల్ లైనుగా మార్చాలని కూడా ఇటీవల మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇకముందు రామాయపట్నం పోర్టుకు మోచర్ల వద్ద నుంచి రోడ్డు మార్గం, తెట్టు నుంచి రైలుమార్గం ఖరారవటంతో రెండింటికి అనుసంధానంగా ఉండేలా కార్గో టెర్మినల్ నిర్మించేందుకు నిర్ణయించారు. దీంతో తెట్టు, మోచర్ల గ్రామాల పరిధిలో తీరప్రాంతంలో రామాయపట్నం గ్రామం వరకు సరుకు నిల్వల టెర్మినల్ (గోదాములు) నిర్మాణం జరుగుతుందని భావిస్తున్నారు. మొదటి దశలో పోర్టు కోసం సేకరించిన భూమిలోనే రమారమి 154 ఎకరాలలో గోదాములు నిర్మాణం చేయనున్నప్పటికీ భవిష్యత్తులో విస్తరణ మోచర్ల, తెట్టుల వద్ద చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
రైలు రవాణా పెంపే కార్గో టెర్మినల్ నిర్మాణ లక్ష్యం
ప్రస్తుతం సరుకు రవాణాలో మూడింట రెండొంతులకుపైగా రోడ్డు రవాణాపై ఆధారపడుతున్నారు. భవిష్యత్తులో కనీసం 50శాతం రైలు మార్గంలో జరిగేలా ప్రోత్సహించటం ద్వారా రవాణా చార్జీలు తగ్గించాలన్నది కేంద్రప్రభుత్వ ఆలోచనగా అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రామాయపట్నం పోర్టుకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి, కొంతమేర మహారాష్ట్ర నుంచి కూడా సరుకు ఎగుమతుల కోసం వచ్చే అవకాశం ఉందని, ఇక్కడి నుంచి ఒడిశా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు ఎగుమతులు భారీగా జరుగుతాయని భావిస్తున్నారు. అలాగే ఎరువులు, బొగ్గు, పల్ప్ తదితర వస్తువుల దిగుమతులకు పోర్టు కీలకంగా మారుతుందని ఆయా సరుకులు ఇక్కడి నుంచే పలు రాష్ట్రాలకు రవాణా జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఐరన్ ఓర్ ఎగుమతులలో కీలక భూమిక
ముఖ్యంగా మాలకొండ పరిసరాల్లో బయటపడిన ఐరన్‌ఓర్ నిక్షేపాలు ఎగుమతులలో ఈ పోర్టు కీలకభూమిక పోషించనుంది. స్టీల్‌ప్లాంట్‌లకు ఐరన్‌ఓర్ తరలించటంలో అధికశాతం పోర్టుతో సంబంధం లేకుండా రైలుమార్గం గుండా నేరుగా ఆయా ఉక్కు పరిశ్రమలకు తరలించే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని రకాల పంట ఉత్పత్తులు, ఇతర సరుకుల ఎగుమతులు, దిగుమతులలో పోర్టుతో ప్రమేయం లేకుండా రైలుమార్గం కీలకంగా మారనుందన్న అంచనాతో ప్రత్యేక రైలు కార్గో టెర్మినల్ నిర్మాణానికి నిర్ణయించారు. ఇందుకోసం పోర్టు సమీపంలో నిర్మించే కార్గో టెర్మినల్‌తో పాటు మోచర్ల, తెట్టుల వద్ద ప్రత్యేకంగా కార్గో రైలు టెర్మినల్ నిర్మాణానికి నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
మెరుగవనున్న ఉపాధి అవకాశాలు
కార్గో రైలు టెర్మినల్ నిర్మాణంతో కార్మికులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. టెర్మినల్ పనులు ప్రారంభమైతే పెద్దసంఖ్యలో నిర్మాణ కార్మికులకు డిమాండ్ ఏర్పడుతుంది. కొన్ని సంవత్సరాలపాటు వందలాది మందికి ఇక్కడ ఉపాధి లభించనుంది. అలాగే పోర్టులో కార్యకలాపాలతో సరుకు ఎగుమతులు, దిగుమతులు మొదలైతే వందలాది మంది హమాలీల అవసరం ఏర్పడుతుంది. పోర్టులో హమాలీలుగా పర్మినెంట్ ఉపాధి పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీరితోపాటు నాన్ టెక్నికల్, టెక్నికల్ రంగాలలో కూడా వందలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. మొత్తంగా రైలు కార్గో టెర్మినల్ నిర్మాణంతో 1,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.