మళ్లీ ‘పెట్రో’ బాంబు
ABN , Publish Date - May 26 , 2026 | 01:25 AM
వాహనదారులపై మరో సారి పెట్రో ధరల బాంబు పడింది. ఆయిల్ కంపెనీలు లీటర్ డీజిల్‌పై రూ.2.75, పెట్రోలుపై రూ.2.84 పైసలు పెంచాయి. దీంతో ఒంగోలులో లీటర్ పెట్రోలు రూ.116.67, డీజిల్ రూ.104.40కి చేరింది.
లీటర్ డీజిల్‌పై రూ.2.75, పెట్రోలుపై రూ.2.84 బాదుడు
పది రోజుల్లో నాల్గోసారి పెంచిన ఆయిల్ కంపెనీలు
వాహనదారుల్లో ఆందోళన.. అన్నివర్గాలపై భారం
ఒంగోలు కలెక్టరేట్, మే 25 (ఆంధ్రజ్యోతి) : వాహనదారులపై మరో సారి పెట్రో ధరల బాంబు పడింది. ఆయిల్ కంపెనీలు లీటర్ డీజిల్‌పై రూ.2.75, పెట్రోలుపై రూ.2.84 పైసలు పెంచాయి. దీంతో ఒంగోలులో లీటర్ పెట్రోలు రూ.116.67, డీజిల్ రూ.104.40కి చేరింది. కొత్త రేట్లు సోమవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. పది రోజుల వ్యవధిలో ఆయిల్ కంపెనీలు పెట్రో ధరలను పెంచడం ఇది నాల్గోసారి. ఈనెల 15వతేదీ ఉదయం ఆరు గంటలలోపు పెట్రోలు లీటర్ రూ.108.78, డీజిల్ రూ.96.65గా ఉండేది. 15వతేదీ ఉదయం ఆరు గంటల తర్వాత లీటర్ డీజిల్, పెట్రోలు రూ.3.11 పెరిగింది. ఈనెల 19వ తేదీ డీజిల్, పెట్రోలు ధర లీటర్‌కు 0.95పైసల చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. తాజాగా సోమవారం డీజిల్‌పై రూ.2.75, పెట్రోలుపై రూ.2.84 బాదాయి. ఇలా నాలుగు పర్యాయాల్లో డీజిల్‌పై రూ.7.75, పెట్రోలుపై రూ.7.89 పెంచాయి.
ఎప్పుడంటే అప్పుడు పెంపు
గతంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ముందురోజే ప్రకటించేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. ఎప్పుడంటే అప్పుడు ధరలు పెంచుతున్నాయి. జిల్లాలో 197 పెట్రోలు బంకుల ఉన్నాయి. వీటి పరిధిలో రోజుకు 2.94 లక్షల లీటర్ల పెట్రోలు, 5.28 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. రెండూ కలిపి 8.22 లక్షల లీటర్ల వరకూ ఉంటుంది. తాజాగా పెరిగిన ధరలతో రోజుకు వాహనదారులపై రూ.24 లక్షలకుపైన భారం పడుతోంది. ఈనెల 15వతేదీ నుంచి ఇప్పటివరకు పెరిగిన ధరలలో కోట్లలో భారం పడింది. డీజిల్ ధర పెంపు ప్రభావం రవాణా రంగంపై చూపి ఆ మేర అన్నిరకాల వస్తువులపై ధరలు పెరిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో డీజిల్, పెట్రోలు ధరలు ఇంకా పెరుగుతాయని ప్రచారం జోరు అందుకోవడంతో వాహనదారుల్లో మరింత ఆందోళన నెలకొంది.