మరోసారి అవకాశం
ABN , Publish Date - Jul 16 , 2026 | 02:42 AM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో మిగిలిపోయిన ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియ మంగళవారంతో ముగియాల్సి ఉన్నప్పటికీ ఈనెల 24వతేదీ వరకు పొడిగించింది.
వెంటనే నమోదు చేసుకోవాలి
వివరాలు అందని వారు 9.25శాతం
జిల్లాలో అలాంటి ఓటర్లు 1.29లక్షలు
చనిపోయిన వారు 40,737 మంది
వలస వెళ్లిన వారు 23,025 మంది
ఒంగోలు కలెక్టరేట్, జూలై 15 (ఆంఽధ్ర జ్యోతి) : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో మిగిలిపోయిన ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియ మంగళవారంతో ముగియాల్సి ఉన్నప్పటికీ ఈనెల 24వతేదీ వరకు పొడిగించింది. జిల్లాలో 1,649 పోలింగ్ కేంద్రాల పరిధిలో 13,99,006 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 12,69,595 (90.75 శాతం) మంది డిజిటలైజేషన్ పూర్తిచేసుకున్నారు. 1,29,411 మంది ఓటర్లు మిగిలిపోయారు. అందులో 40,737 మంది డెత్(చనిపోయిన) ఓటర్లు ఉన్నారు. మరో 23,025మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు గుర్తించారు. మరో 13,746 మంది ఇతర ప్రాంతాల్లో డిజిటలైజేషన్ పూర్తిచేయించుకోగా, 443 మంది ఓటర్లు అసలు ఎన్యుమరేషన్ ఫాంలు తీసుకునేందుకు ముందుకురాలేదు. మరో 51,460 మంది మ్యాపింగ్‌కు దూరంగా ఉన్నారు. జిల్లావ్యాప్తంగా డిజిటలైజేషన్ చేయించుకోని ఓటర్లకు ఎన్నికల సంఘం మరో పది రోజులు అవకాశం కల్పించింది. బూత్ లెవల్ అధికారులు(బీఎల్వోల) మరోసారి ఇంటింటికీ వెళ్లి పరిశీలించేలా చర్యలు తీసుకుంది.