Share News

అద్దంకి మీదుగా మరో హైవే

ABN , Publish Date - Sep 20 , 2026 | 03:03 AM

అద్దంకి మీదుగా మరో హైవే నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలను కలుపుతూ చీరాల సమీపంలోని మోటుపల్లి నుంచి మార్కాపురం సమీపంలోని తోకపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది.

అద్దంకి మీదుగా మరో హైవే
అద్దంకి-దర్శి ఆర్‌అండ్‌బీ రోడ్డు

ముఖ్యమంత్రి నుంచి గ్రీన్‌సిగ్నల్‌

కేంద్ర మంత్రిని కలిసేందుకు త్వరలో ఢిల్లీ వెళ్లనున్న మంత్రి రవికుమార్‌

అద్దంకి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : అద్దంకి మీదుగా మరో హైవే నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలను కలుపుతూ చీరాల సమీపంలోని మోటుపల్లి నుంచి మార్కాపురం సమీపంలోని తోకపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ మోటుపల్లి-తోకపల్లి హైవే నిర్మాణం ఆవశ్యకతను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రాథమిక నివేదికను సిద్ధం చేసుకొని త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రిని కలవనున్నట్లు మంత్రి రవికుమార్‌ తెలిపారు. మోటుపల్లి-తోకపల్లి హైవే నిర్మాణంతో బాపట్ల జిల్లా ఓడరేవు ప్రాంతం నుంచి రాయలసీమ జిల్లాలతోపాటు మార్కాపురం జిల్లాకు రవాణా వసతి మరింత మెరుగుపడనుంది. బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరు, ప్రకాశం జిల్లాలోని అద్దంకి, దర్శి, సంతనూతలపాడు, మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలకు ప్రయోజనం కలగనుంది. అదేసమయంలో పార్రిశామిక కారిడార్‌గా అభివృద్ధి చెందనున్న దొనకొండ ప్రాంతం నుంచి రామయపట్నం పోర్టుకు కూడా కనెక్టివిటీ పెరగనుంది. ఒంగోలు-దిగమర్రు హైవే నుంచి చెన్నై-కోల్‌కతా హైవే, విజయవాడ-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు, తోకలపల్లి-నంద్యాల హైవేతోపాటు పాత మద్రాస్‌ రోడ్డు, నార్కెట్‌పల్లి-అద్దంకి-మేదరమెట్ల(నామ్‌)ఎక్స్‌ప్రెస్‌ రోడ్డును అనుసంధానం చేయనుంది. మోటుపల్లి నుంచి ఇంకొల్లు, అద్దంకి, దర్శి, దొనకొండ మీదుగా హైవే వెళ్లనుంది. అద్దంకి, దర్శి పట్టణాలతోపాటు పలు మండల కేంద్రాల వద్ద కూడా బైపాస్‌ రోడ్లు ఏర్పాటుచేసే అవకాశం ఉంటుంది. దీని వలన అద్దంకి, దర్శిలలో ట్రాఫిక్‌ సమస్యకు కూడా పరిష్కారం లభించే అవకాశం ఉంది. అదేసమయంలో బాపట్ల, ప్రకాశం జిల్లాలలోని పలుప్రాంతాల నుంచి శ్రీశైలం, కర్నూలు వెళ్లేందుకు కూడా దగ్గరి మార్గం కానుంది. దొనకొండ పారిశ్రామిక అభివృద్ధికి కూడా ఎంతగానో దోహదపడే అవకాశం ఉండటంతో కార్యరూపం దాల్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మంత్రి రవికుమార్‌ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిసిన తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Sep 20 , 2026 | 03:03 AM