Share News

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

ABN , Publish Date - Aug 20 , 2026 | 02:12 AM

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మరో రూ.200 కోట్ల పరిహారాన్ని బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ప్రాజెక్టు కోసం ఊళ్లను త్యాగం చేసిన వారిని ఆయన అభినందించారు. నిర్వాసితుల తరఫున అమరావతి వెళ్లిన వారికి అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సీఎం చెక్కును అందజేశారు.

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు
నిర్వాసితులకు చెక్కును అందజేస్తున్న సీఎం చంద్రబాబు

అమరావతిలో చెక్కును అందజేసిన సీఎం చంద్రబాబు

ఇప్పటికి రెండు విడతల్లో ఇచ్చినది రూ.518 కోట్లు

మార్కాపురం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మరో రూ.200 కోట్ల పరిహారాన్ని బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ప్రాజెక్టు కోసం ఊళ్లను త్యాగం చేసిన వారిని ఆయన అభినందించారు. నిర్వాసితుల తరఫున అమరావతి వెళ్లిన వారికి అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సీఎం చెక్కును అందజేశారు. జూన్‌ 27న స్వయంగా వెలిగొండకు వచ్చిన చంద్రబాబు ఆ సమయంలో రూ.318 కోట్లు విడుదల చేశారు. 2,557 కుటుంబాలకు ఆ నగదు జమైంది. ఇప్పుడు 1,600 మందికి వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.200 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నగదు కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతుంది. మొత్తం 7,321 కుటుంబాల్లో 4,157 కుటుంబాలకు ఇప్పటి వరకూ రూ.518 కోట్లు అందజేశారు. మరోవైపు పునరావాస చర్యలను వేగవంతం చేశారు. 11 ముంపు గ్రామాల ప్రజల కోసం 7 చోట్ల పునరావాస కాలనీలు ఏర్పాటవుతుండగా వేములకోట తప్ప మిగిలిన అన్నిచోట్లా మౌలిక వసతుల కల్పన పనులు పూర్తయ్యాయి. నిర్వాసితులు కూడా తమ సామగ్రితో ఊళ్లను విడుస్తున్నారు. మొత్తమ్మీద ఈ ప్రాంత ప్రజల ఏళ్లనాటి వెలిగొండ జలాల కల త్వరలోనే సాకారం కానుంది. చెక్కు అందజేత కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఉమ్మడి జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, ఒంగోలు ఎమ్మెల్యేలు డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, దామచర్ల జనార్దన్‌, టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 02:12 AM